రాజపక్స అధికారం చెల్లదు

4 Dec, 2018 04:39 IST|Sakshi
మహిందా రాజపక్స

శ్రీలంక కోర్టు ఆదేశాలు

కేబినెట్‌ మంత్రులకూ వర్తింపు

అనర్హులు పదవిలో ఉంటే తీరని నష్టమని వ్యాఖ్య

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధానిగా నియమించిన మహిందా రాజపక్స అధికారం చెలాయించడం కుదరదని శ్రీలంక కోర్టు సోమవారం తేల్చిచెప్పింది. రాజపక్స కేబినెట్‌ మంత్రులూ విధులు నిర్వర్తించరాదంది. మైత్రిపాల వివాదాస్పద నిర్ణయాన్ని సవాలు చేస్తూ 122 మంది పార్లమెంట్‌ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌ ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12, 13న చేపడతామని తెలిపింది. అనర్హులు ప్రధాని, మంత్రులుగా ఉంటే భర్తీ చేయలేనంత నష్టం వాటిల్లుతుందని ఈ సందర్భంగా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

రాజపక్స ప్రధాని పదవి చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ, జనతా విముక్తి పేరమునా(జేవీపీ), తమిళ్‌ నేషనల్‌ అలియన్జ్‌ పార్టీలు గత నెలలో కోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని విక్రమసింఘె చెప్పారు. అక్టోబర్‌ 26న రణిల్‌ విక్రమ్‌సింఘేను తొలగించిన సిరిసేన ఆ పదవిని మహిందా రాజపక్సకు కట్టబెట్టడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల్ని మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని రాజపక్స ప్రకటించారు. కేబినెట్‌ను సస్పెండ్‌ చేయడం సరికాదని, రాజ్యాంగపర విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకే ఉందని పేర్కొన్నారు.

ముగింపు దిశగా సంక్షోభం
సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ను రద్దుచేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ఈ కేసు తుది విచారణకు రానుంది. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్న సిరిసేన అంతకు ముందే పార్లమెంట్‌ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నారని ఆయన పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు