‘ఆరోజు అలసిపోవడంతో బతికిపోయాను’

23 Apr, 2019 19:25 IST|Sakshi

‘నిజానికి ఆరోజు నేను చర్చికి వెళ్లాల్సింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు విన్నాను. చర్చిలో బాంబు పేలిందని అందరూ అరుస్తున్నారు. నేను వెంటనే అక్కడికి పరిగెత్తుకు వెళ్లాను. అక్కడి భయానక దృశ్యాల్ని నేను ఎన్నటికీ మరచిపోలేను’ అంటూ శ్రీలంక క్రికెటర్‌ దసున్‌ షణక తన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.  అలసిపోయినందు వల్ల చర్చికి వెళ్లలేకపోయాయని.. అందుకే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నానని పేర్కొన్నాడు. ఈస్టర్‌ సండే రోజున శ్రీలంకలోని వరుస పేలుళ్లలో ఇప్పటికే 320కు పైగా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఎనిమిది చోట్ల జరిగిన ఈ పేలుళ్లలో నెగోంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో అత్యధికంగా వంద మంది చనిపోయారు.

ఈ విషయం గురించి దసున్‌ మాట్లాడుతూ.. ‘ ఆరోజు మా అమ్మ, బామ్మ కూడా ఈస్టర్‌ సర్వీస్‌ కోసం సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చికి వెళ్లారు. అక్కడి సీన్‌ చూస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. పేలుడు కారణంగా చర్చి మొత్తం ధ్వంసమైంది. వందలాది శవాలను బయటికి తీసుకు వస్తుంటే నా శరీరం కంపించింది. ఆ దృశ్యాలను చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్లెవరైనా బతికి ఉంటారనే ఆలోచన కూడా రాదు. అయితే అదృష్టవశాత్తూ అమ్మా, బామ్మ ప్రాణాలతో బయటపడ్డారు. బామ్మ తలకు గాయమైంది. సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు’ అని వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంక తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు, 19 వన్డేలు, 27 టీ20లు దసున్‌ ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తన హోం టౌన్‌ నెగోంబోలో ఎప్పుడూ మత ఘర్షణలు జరగలేదని చెప్పే ఈ యువ ఆటగాడు.. ఆదివారం నాటి ఘటన మాత్రం తనను బెంబేలెత్తించిందని పేర్కొన్నాడు. ఇప్పుడు వీధుల్లో నడవాలంటేనే చాలా భయంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇక శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటన ఐఎస్‌ మిలిటెంట్‌ గ్రూపు చర్యేనని అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్‌ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్‌ విజేవర్ధనే వెల్లడించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు