లంక పార్లమెంటులో ముష్టిఘాతాలు

16 Nov, 2018 03:07 IST|Sakshi
పార్లమెంటులో సభ్యుల బాహాబాహీ

స్పీకర్‌పై రాజపక్స వర్గం దాడికి యత్నం

ఇప్పటికీ రాజపక్సనే ప్రధాని: అధ్యక్షుడు సిరిసేన

కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ గురువారం యుద్ధ భూమిని తలపించింది. సభ్యులు పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చేతి కందిన వస్తువులను విసిరేసుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ స్పీకర్‌ను కొందరు సభ్యులు చుట్టుముట్టగా మరికొం దరు ఆయనకు రక్షణగా నిలిచారు. ఒక సభ్యుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం పార్లమెంట్‌లో జరిగిన బలపరీక్షలో ప్రధాని మహింద రాజపక్స ఓటమి పాలైన విషయం తెలిసిందే. గురువారం సభ సమావేశం కాగానే ఉద్వాసనకు గురైన ప్రధాని రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ.. దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై ఓటింగ్‌ జరపాలని కోరారు. ఇందుకు స్పీకర్‌ జయసూర్య అంగీకరించడంతో సభలో గొడవ మొదలైంది.

రాజపక్స మాట్లాడేందుకు యత్నించగా సభలో విశ్వాసం కోల్పోయినం దున ప్రధానిగా కాకుండా కేవలం ఎంపీగానే ఆయన్ను గుర్తిస్తానని జయసూర్య ప్రకటిం చారు. ఓటింగ్‌కు సన్నద్ధమవుతున్న దశలో అధ్యక్షుడు సిరిసేన, రాజపక్స మద్దతుదారులైన కొందరు ఎంపీలు స్పీకర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించగా యూఎన్‌పీ సభ్యులు రక్షణగా నిలిచారు.  ఈ క్రమంలో ఒక సభ్యుడు స్పీకర్‌ మైక్‌ను విరగ్గొట్టారు. మరొకరు డస్ట్‌బిన్‌ను, పుస్తకాలను ఆయనపైకి విసిరేశారు. విశ్వాస పరీక్షలో రాజపక్స ఓడినం దున తమదే అసలైన ప్రభుత్వమని విక్రమ సింఘేకు చెందిన యూఎన్‌పీ అంటోంది. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరి స్తున్నాననీ, ఇప్పటికీ రాజపక్సనే ప్రధాని అంటూ సిరిసేన స్పీకర్‌కు లేఖ రాయడం గమనార్హం. ప్రధానికి పార్లమెంట్‌లో మెజారిటీ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు