ఆగని కన్నీళ్లు

23 Apr, 2019 01:28 IST|Sakshi

290కి పెరిగిన శ్రీలంక పేలుళ్ల మృతుల సంఖ్య

కొలంబో: శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షసక్రీడలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య అమాంతం పెరిగింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 215 మంది చనిపోగా, తాజాగా చికిత్స పొందుతూ మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 290కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. కొలంబోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చి, నెగొంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, బట్టికలోవాలోని జియోన్‌ చర్చితో పాటు షాంగ్రీలా, సినమన్‌ గ్రాండ్, కింగ్స్‌బరీ ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఆరుగురికి కొలంబో మేజిస్ట్రేట్‌ మే 6 వరకూ రిమాండ్‌ విధించారు.

విచారణ కమిటీ ఏర్పాటు...
ఈ విషయమై శ్రీలంక ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడుల వెనుక నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌(ఎన్‌టీజే) ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ‘ఈ ఉగ్రదాడిలో ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారు. వీరంతా శ్రీలంక వాసులేనని అనుమానిస్తున్నాం. ఎన్‌టీజేకు విదేశీ సాయం అందిందా? ఈ సంస్థకు విదేశీ ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ కేసును క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ)కి అప్పగించాం. ఉగ్రదాడి జరిగే అవకాశముందని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏప్రిల్‌ 11కు ముందుగానే పోలీస్‌ ఐజీ పుజిత్‌ జయసుందరకు సమాచారం అందించారు. నిఘా సంస్థల హెచ్చరికలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐజీ రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. ఈ ఉగ్ర దుశ్చర్య నేపథ్యంలో ఈ నెల 23న జాతీయ సంతాప దినంగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ దాడి ఘటనపై అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. రెండు వారాల్లోగా విచారణను పూర్తిచేసి నివేదికను అందించాలని ఆదేశించారు.

జాతీయ భద్రతా మండలి భేటీ..
ఉగ్రదాడి నేపథ్యంలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో సమావేశమైన జాతీయ భద్రతా మండలి(ఎన్‌ఎస్‌సీ).. సోమవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించాలని నిర్ణయం తీసుకుంది. కేవలం ఉగ్రమూకలను ఏరివేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించా మనీ, ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది లేదని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు కోర్టు వారంట్‌ లేకుండానే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించేందుకు వీలవుతుంది. ఈ ఉగ్రదాడి వెనుక విదేశీ ఉగ్రసంస్థల హస్తం ఉండొచ్చన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరుకు శ్రీలంక విదేశాల సాయం కోరే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

బాధిత కుటుంబాలకు పరిహారం..
ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో నష్టపోయిన కుటుంబాలకు శ్రీలంక ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఈ విషయమై శ్రీలంక ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ‘ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు 10 లక్షల శ్రీలంక రూపాయలను అందజేస్తాం. అలాగే అంత్యక్రియల నిర్వహణకు మరో రూ.లక్ష ఇస్తాం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో నష్టపరిహారం అందజేస్తాం. ఉగ్రదాడిలో దెబ్బతిన్న చర్చిలను ప్రభుత్వమే పునర్నిర్మిస్తుంది. ఇప్పటివరకూ ఓ అతివాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్‌చేశాం. అనవసర ప్రచారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే వీరి వివరాలను బయటపెట్టడం లేదు’ అని స్పష్టం చేశారు. 10 లక్షల శ్రీలంక రూపాయలు తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు.

దాడి వెనుక ఐసిస్‌ హస్తం?
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 290 మంది చనిపోవడం వెనుక ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐసిస్‌) హస్తం ఉండే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రదాడి విషయంలో భారత ప్రభుత్వం శ్రీలంకతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయమై శ్రీలంకకు చెందిన భద్రతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ దాడి తీవ్రత, జరిగిన తీరును చూస్తే దీన్ని ఐసిస్‌ ఉగ్రవాదులే చేసినట్లు అనిపిస్తోంది. ఆత్మాహుతిదాడిలో వాడిన పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను జాగ్రత్తగా మరింత క్షుణ్ణంగా విశ్లేషించాల్సిన అవసరముంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికే శ్రీలంకలోని చర్చిలను ఈస్టర్‌ రోజున ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రసంస్థ లష్కరే తోయిబా శ్రీలంకలో అడుగుపెట్టేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాల వద్ద సమాచారం ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌లో రెండు మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న 50 మంది ముస్లింలను బ్రెంటన్‌ అనే క్రైస్తవ శ్వేతజాతీయుడు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా శ్రీలంక ఐసిస్‌ మాడ్యూల్‌ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీలంకలోని బౌద్ధులు క్రైస్తవ మతం స్వీకరించడంపై ఇరువర్గాల మధ్య స్వల్పఘర్షణలు చోటుచేసుకున్నాయనీ, దాని కారణంగానే ఈ బాంబు పేలుళ్లు జరిగి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘేను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలే ఈ దాడులకు తెగబడ్డాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

మృతుల్లో 8 మంది భారతీయులు
దొడ్డబళ్లాపుర / తుమకూరు: శ్రీలంక ఉగ్రదాడుల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య సోమవారం నాటికి ఎనిమిదికి చేరుకుంది. బాంబు పేలుళ్లలో లక్ష్మీ, నారాయణ్‌ చంద్రశేఖర్, రమేశ్‌ గౌడ చనిపోయినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ అంతకుముందు ప్రకటించగా, ఇదే దాడుల్లో కె.జి.హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప, హెచ్‌.శివకుమార్, వేమురై తులసీరాం, ఎస్‌.ఆర్‌.నాగరాజ్‌ చనిపోయినట్లు కొలంబోలోని భారత హైకమిషన్‌ తెలిపింది. చనిపోయివారిలో ఐదుగురు జేడీఎస్‌ నేతలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే కేరళకు చెందిన పీఎస్‌ రసైనా(58) ఈ ఉగ్రదాడిలో దుర్మరణం చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. అయితే రసైనా మృతిని శ్రీలంక అధికారులు ధ్రువీకరించలేదు. వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం  తెలిపింది. మరోవైపు కొలంబోలోని పెట్టాహ్‌ ప్రాంతంలో ఉన్న బస్‌స్టేషన్‌లో పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. అలాగే ఈ ఘాతుకానికి తెగబడేముందు ఉగ్రమూకలు దక్షిణ కొలంబోలోని పనదుర ప్రాంతంలో 3 నెలలపాటు తలదాచుకున్న ఇంటిని గుర్తించారు. కాగా, కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేదారిలో 6 అడుగుల పైపులో అమర్చిన శక్తిమంతమైన ఐఈడీ బాంబును అధికారులు గుర్తించారు.

కొలంబోలో మరో బాంబు పేలుడు..
కొలంబోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిలో సోమవారం మరో బాంబు పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. దీంతో అధికారులు స్పందిస్తూ.. ఉగ్రవాదులు ఓ వాహనంలో బాంబును అమర్చారని తెలిపారు. దీన్ని నిర్వీర్యం చేస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలిందన్నారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు