నేడు శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా!

15 Dec, 2018 02:07 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో రెండు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని పదవికి మహింద రాజపక్స నేడు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ గురువారం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ప్రధాని రాజపక్స, ఆయన మంత్రివర్గం తమ అధికారాలను నిర్వర్తించకుండా కోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ శుక్రవారం మరో కీలక తీర్పు వెలువరించింది. ‘దేశంలో రాజకీయ అస్థిరత తొలగిపోయేందుకు వీలుగా రాజపక్స తన పదవికి శనివారం రాజీనామా చేయనున్నారు.

శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ), శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)లు మరికొన్ని పార్టీలతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు’ అంటూ రాజ పక్స కుమారుడు నమల్‌ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజపక్స తప్పుకుంటే తమ నేతను తిరిగి ప్రధానిగా చేయడం మినహా అధ్యక్షుడు సిరిసేనకు మరో మార్గంలేదని విక్రమసింఘే మద్దతుదారులు అంటున్నారు. అయితే, విక్రమసింఘేతో విభేదాలున్నందున ఆయన్ను తిరిగి ప్రధానిగా నియమించేది లేదని సిరిసేన స్పష్టం చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు