శ్రీలంకలో ఎమర్జెన్సీ : కొలంబోలో 87 బాంబులు లభ్యం

22 Apr, 2019 16:37 IST|Sakshi

కొలంబో : వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విక్రమ సింఘే సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుందనే సంకేతాలు పంపారు. ఎమర్జెన్సీపై అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటన చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. కొలంబో మెయిన్‌ బస్టాండ్‌ వద్ద సోమవారం పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు.

భారీ పేలుళ్లకు కుట్ర జరిగిందని అధికారులు వెల్లడించారు. 24 మంది అనుమానితులను అరెస్ట్‌ చేశారు. కొలంబో వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు దాడి వెనుక నేషనల్‌ తౌహీత్‌ జమాద్‌ హస్తముందని భావిస్తున్నారు. ఈ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సహకరించాయని చెబుతున్నారు. ఇక శ్రీలంక వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 300కు చేరువైంది.

మరో బాంబు పేలుడు
శ్రీలంకను వరస బాంబు పేలుళ్లు వణికిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కొచ్చికేడ్‌లోని సెయింట్‌ ఆంథోనియా చర్చి వద్ద మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. తాజా పేలుడుతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొలంబోలోని హోటళ్లన్నింటినీ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీలంక వ్యాప్తంగా హైఅలర్ట్‌ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు