అమెరికా ‘సుప్రీం’ జడ్జిగా శ్రీనివాసన్!

15 Feb, 2016 07:08 IST|Sakshi
అమెరికా ‘సుప్రీం’ జడ్జిగా శ్రీనివాసన్!

అవకాశం లభిస్తే తొలి ఇండో-అమెరికన్‌గా గుర్తింపు
♦ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డ సీనియర్ జడ్జి స్కాలియా
♦ ఆయన స్థానంలో శ్రీనివాసన్‌కు చాన్స్
 
 హూస్టన్: అమెరికా సుప్రీం కోర్టు జడ్జి, సంప్రదాయవాది జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) మృతి చెందడంతో ఆస్థానంలో భారత సంతతికి చెందిన జడ్జి శ్రీనివాసన్‌కు అవకాశం లభించనుంది. టెక్సాస్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా జస్టిస్ స్కాలియా అనుమానాస్పదిరీతిలో మృత్యువాత పడ్డారు. అయితే ఆయన మృతికి కారణంఏమిటనేది తెలియలేదు. జస్టిస్ స్కాలియా వారసుడిగా భారత సంతతికి చెందిన జడ్జి శ్రీ శ్రీనివాసన్ పేరు తెరపైకి వచ్చింది. కాగా, దక్షిణ మార్ఫాలోని బిగ్ బెండ్ ప్రాంతంలో 30 వేల ఎకరాల్లో ఉన్న సిబోలో క్రీక్ రాంచ్ రిసార్ట్‌కు జస్టిస్ స్కాలియా శుక్రవారం వెళ్లారని అధికారులు తెలిపారు.

అక్కడ జరిగిన పార్టీలో పాల్గొన్న అనంతరం గదికి వెళ్లిన తర్వాత.. ఆయన చనిపోయారని చెప్పారు. జస్టిస్ స్కాలియా 1986లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. జస్టిస్ స్కాలియా మృతికి అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం తెలిపారు. సుధీర్ఘ కాలం పనిచేసిన  ఒక గొప్ప న్యాయమూర్తి అని కొనియాడారు. ఆయన స్థానాన్ని తాను అంతే గొప్ప వ్యక్తితో భర్తీ చేస్తానని చెప్పారు. అయితే దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మరో కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేసే ఒబామా.. జడ్జి నియామక నిర్ణయాన్ని తన వారసుడికి అప్పగించాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు కోరుతున్నారు. కానీ, తనకు రాజ్యాంగ పరంగా లభించిన హక్కులను వినియోగించుకుంటానని ఒబామా చెబుతున్నారు.  

 సుప్రీంకోర్టుకు తొలి ఇండో-అమెరికన్
 స్కాలియా స్థానాన్ని జస్టిస్ శ్రీకాంత్ శ్రీ శ్రీనివాసన్‌తో ఒబామా భర్తీ చేయడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. 48 ఏళ్ల శ్రీనివాసన్ చండీగఢ్‌లో జన్మించారు. తమిళనాడుకు చెందిన ఆయన తల్లిదండ్రులు 1960ల్లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. శ్రీనివాసన్‌కు సుప్రీంకోర్టులో అవకాశం దక్కితే.. ఆ స్థానం దక్కించుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు. ఒబామా దృష్టిలో ఆయనదే ప్రథమ స్థానం అని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలిపింది. కొంతమంది రిపబ్లికన్లు కూడా తన అభిమతానికి మద్దతిస్తారని ఒబామా భావిస్తున్నట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది. డీసీ సర్క్యూట్ కోర్టు అప్పీల్స్ జడ్జిగా ఉన్న శ్రీనివాసన్.. ఇప్పటికే ఒబామా నామినీల రేసులో ముందువరుసలో ఉన్నారని ఆ వార్తా సంస్థ లీగల్ ఎనలిస్ట్ జెఫ్రీ టూబిన్ తెలిపారు. శ్రీనివాసన్ నామినేషన్ గతంలోనే సెనేట్ ఆమోదం పొందిందని విశ్లేషకులు చెబుతున్నారు. 1989లో పట్టాతీసుకున్న శ్రీనివాసన్ గతంలో ఒబామా ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. పెళ్లి చట్టానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం కారణంగా గుర్తింపు పొందారు. 2013లో డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు