రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీ

25 Nov, 2015 02:25 IST|Sakshi
రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీ

♦ టర్కీపై మండిపడ్డ పుతిన్  
♦ త్వరలో నాటో ప్రత్యేక సమావేశం
 
 అంకారా: తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంతో రష్యా సుఖోయ్ యుద్ధ విమానం ఎస్‌యూ 24ను టర్కీ సైన్యం ఎఫ్ 16 యుద్ధ విమానంతో కూల్చివేసింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనను టర్కీ సైన్యంతోపాటు, రష్యా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. తమ గగనతలంలోకి ప్రవేశించడంతోపాటు పలుమార్లు చేసిన హెచ్చరికలను లెక్కచేయనందునే రష్యా విమానాన్ని కూల్చేసినట్లు టర్కీ పేర్కొంది. రష్యా విమానం టర్కీ సరిహద్దు కొండల్లో పేలిపోగా.. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో బయటపడ్డారని. వీరిలో ఒకరు సిరియా ఉగ్రవాదులకు చిక్కారని టర్కీ మీడియా చెప్తుండగా, అయితే ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారని, మరొకరు గల్లంతయ్యారని సిరియా వర్గాలు చెబుతున్నాయి.

టర్కీ గగనతలంలోకి తమ విమానం ప్రవేశించిందనడాన్ని రష్యా  ఖండించింది. తమ విమానం సిరియా గగనతలంలోనే ఉన్నట్లు నిరూపిస్తామని సవాల్ విసురుతోంది. కానీ, సిరియాలోని ఉగ్రవాదులపై దాడుల పేరుతో తమ సరి హద్దు గ్రామాలపై ర ష్యా దాడులు చేస్తోం దని టర్కీ పేర్కొం ది. టర్కీకి రక్షణగా యూఎస్ యూరోపియన్ కమాండ్ ఆరు యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. టర్కీ గగనతలంలోకి రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించడాన్ని నాటో తప్పుబట్టింది. టర్కీ అభ్యర్థనమేరకు ఈ ఘటనపై చర్చించేందుకు నాటో వర్గాలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాయి.

 విమానాన్ని కూల్చడం వెన్నుపోటే: పుతిన్
 సిరియా టర్కీ సరిహద్దులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన తమ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేయడాన్ని రష్యా జీర్ణించుకోలేక పోతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు. తమ యుద్ధ విమానాన్ని కూల్చడం వెన్నుపోటని వ్యాఖ్యానించారు. తమ విమానం సిరియా సరిహద్దులో పడిపోయిందని.. అది టర్కీ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. తాజా ఘటన రష్యా, టర్కీ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కాగా తమ గగనతల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలైనా తీసుకునే హక్కు తమకుందని అందరికీ తెలుసని టర్కిష్ ప్రధాని అహ్మెత్ డవుటోగ్లు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు