సూర్యుడికి పొరుగున హిమ నక్షత్రం!

27 Apr, 2014 00:49 IST|Sakshi
సూర్యుడికి పొరుగున హిమ నక్షత్రం!

మన సౌర కుటుంబానికి పొరుగున.. కేవలం 7.2 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న అతి చల్లని నక్షత్రం ఇది. పేరు ‘వైజ్ జే085510.83071442.5’. ఇప్పటిదాకా కనుగొన్న బ్రౌన్ డ్వార్ఫ్ నక్షత్రాల్లో ఇదే అత్యంత చల్లనిదట. ఇదెంత చల్లగా ఉంటుందంటే..  మైనస్ 48-13 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతతోనే ఉంటుందట. అంటే.. ఇదో మంచు నక్షత్రం అన్నమాట. మన సూర్యుడిలాంటి నక్షత్రాలు కేంద్రక సంలీనం చర్య వల్ల హైడ్రోజన్‌ను హీలియం వాయువులుగా మారుస్తూ నిరంతరం అంతులేని వేడి, వెలుగులు, రేడియేషన్ విరజిమ్ముతుంటాయి.

కానీ బ్రౌన్ డ్వార్ఫ్ వంటి మరుగుజ్జు నక్షత్రాలలో చాలా తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి.. వాటిలో కేంద్రక సంలీనం చర్యలు జరగవు. అందువల్ల అవి చల్లగానే ఉంటాయి. తాజా మరుగుజ్జు నక్షత్రం ద్రవ్యరాశి గురుగ్రహం కన్నా 10 రెట్లు మాత్రమే ఎక్కువ  కావడంతో ఇది పూర్తిస్థాయి నక్షత్రంగా మారలేకపోయిందట. దీనిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన వైజ్, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోపుల ద్వారా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కెవిన్ లూమన్ కనుగొన్నారు. ఇలాంటి నక్షత్రాలపై అధ్యయనం ద్వారా అతిచల్లని గ్రహాలపై వాతావరణాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు