తార్రోడ్డు కాదు... స్టార్రోడ్డు!

9 Oct, 2016 03:41 IST|Sakshi
తార్రోడ్డు కాదు... స్టార్రోడ్డు!

‘నువ్వొస్తానంటే... నక్షత్రాలను నీ పాదాల కింద పరిచేస్తా’ అంటాడో ప్రేమికుడు. అలా వీలవుతుందో కాదో తెలియదుగానీ... ఈ రోడ్డును చూస్తే మాత్రం.. వావ్ అనిపిస్తుంది. యూరప్‌లోని ఓ చిన్న దేశం పోలెండ్‌లో ఏర్పాటైన ఈ రోడ్డు రాత్రిపూట నక్షత్రాల మాదిరిగా మిలమిలా మెరిసిపోతూంటుంది. ప్రుజ్‌స్కోలోని ఓ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ డిజైన్ చేసిన ఈ రహదారిలోని ప్రత్యేక పదార్థం పగలంతా సూర్యుడి వెలుగును పీల్చుకుని రాత్రిపూట దాదాపు పదిగంటల పాటు కాంతులీనుతూ ఉంటుంది. ఇంతకీ ఈ మెరిసే రోడ్డును కట్టింది ఎందుకో తెలుసా? రాత్రిళ్లు సైకిళ్లపై వెళ్లేవారి భద్రత కోసమట!
 
 దారి కనిపించక ఎక్కడ పడిపోతారో అని దీన్ని ఏర్పాటు చేశారు. ఫొటోలో ఉన్నది నీలం రంగులో మెరుస్తోందిగానీ.. రంగులు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది దీంట్లో. అయితే ఇలాంటి రోడ్డు ఇదే తొలిసారేమీ కాదు. ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వాన్‌గో స్వస్థలమైన నెయెనెన్ (నెదర్లాండ్స్)లో డాన్ రూస్‌గార్డే అనే ఆర్టిస్ట్ కూడా ఇలాంటి రహదారి ఒకదాన్ని సిద్ధం చేశారు. అది వాన్‌గో సుప్రసిద్ధ చిత్రం ‘స్టారీ నైట్’ను పోలి ఉంటుంది. పోలెండ్‌లోని నక్షత్ర దారి అందంగా కనిపించడం మాత్రమే కాకుండా... ఎక్కువ కాలం మన్నుతుందని అంటున్నారు దీని డిజైనర్లు. ఇవన్నీ పక్కన పెట్టండి... చుట్టూ చీకట్లు పరచుకున్న వేళ ఈ నక్షత్రాల దారిలో అలా అలా సైకిల్‌పై వెళ్లడం మిగిల్చే అనుభూతి ఎలా ఉంటుందంటారు? నిజంగానే అది వావ్ ఫ్యాక్టర్.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు