ప్రకటన.. కనిపించుట లేదు..

10 Apr, 2014 01:08 IST|Sakshi
ప్రకటన.. కనిపించుట లేదు..

సావో పాలో.. బ్రెజిల్‌లో ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద నగరాల్లో ఇదీ ఒకటి.. జనాభా 1.2 కోట్లు.. మీరు ఈ మహా నగరం మొత్తం తిరిగి చూడండి.. ఎక్కడా ఒక్క యాడ్ కూడా కనిపించదు! కనీసం పోస్టర్ కూడా!! మనం మన ఊళ్లో రోడ్డు మీదకెక్కితే ఎక్కడికక్కడ హోర్డింగ్స్ మీద యాడ్స్, పోస్టర్లు, బస్సుల మీద.. ఆటోల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు.. ఆ సబ్బు అని.. ఈ డ్రింక్ అని.. బట్టలని.. ఇలా ఏదో ఒకదాని గురించి ప్రకటనలు. అయితే, ఇంత పెద్ద మహానగరంలో అది మచ్చుకైనా కనిపించదు. అంతా క్లీన్ అండ్ క్లియర్. ఎందుకంటే..  ఇక్కడ అవుట్ డోర్ యాడ్స్ నిషిద్ధం. 2006 సెప్టెంబర్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ మేరకు చట్టం చేశారు. అది నేటికీ అమలవుతోంది.

ఈ చట్టం తేవాలనుకున్నప్పుడు బిజినెస్ పడిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తర్వాతి కాలంలో అది తప్పని రుజువైంది. ఆ సమయానికి సిటీలో ఉన్న 15 వేల బిల్‌బోర్డులను తొలగించారు. కొందరు షాపుల ముందు యాడ్‌లు లాంటివి ఉంచితే.. అలాంటివారి నుంచి మొత్తం రూ.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. కొత్తలో యాడ్స్ లేకుండా సిటీ కొంచెం విచిత్రంగా కనిపించినా.. తర్వాత అక్కడి వారికది అలవాటైపోయింది. ఈ చట్టం ఎలాగుందని 2011లో సర్వే చేసినప్పుడు నగరంలోని 70 శాతం మంది దాని వల్ల మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు