తుదిదశలోనూ హాకింగ్‌ పరిశోధన

19 Mar, 2018 20:10 IST|Sakshi
స్టీఫెన్‌ హాకింగ్‌

లండన్‌ : ఖగోళంలో ఎవరూ దృష్టి సారించని అంశాలపై ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఎన్నో పరిశోధనలు జరిపారు. భౌతిక శాస్రంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన ఆయన విశ్వంలో మనిషిని పోలిన జీవులు ఉండొచ్చని తెలిపి, దానిని నిరూపించడానికి అలుపెరగని ప్రయత్నాలు చేశారు. తన పరిశోధనల సారాన్ని వివరిస్తూ ‘ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’  అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని యువ శాస్త్రవేత్తలకు ఇది ఒక గొప్ప దిక్సూచిగా నిలిచింది. అతి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైనా.. మానవులకు ఏదో మేలు చేయాలనే తపన స్టీఫెన్‌ హాకింగ్‌ది.

స్టీఫెన్‌ హాకింగ్‌ తుదిశ్వాస వరకు పరిశోధనలోనే నిమగ్నమయ్యారు. అందుకు నిదర్శరం తాను చనిపోవడానికి రెండువారాలకు ముందు ఆయన సమర్పించిన పరిశోధనా పత్రాలు. తాను ముందునుంచి చెబుతున్నట్టు.. విశ్వం ఒక్కటే లేదని, దానిని పోలిన విశ్వసముదాయాలు ఎన్నెన్నో ఉన్నాయని పేర్కొంటూ.. తన వాదనకు బలం చేకూర్చే సమాచారాన్ని ఈ పరిశోధనా పత్రాల్లో హాకింగ్‌ పొందుపర్చారు. ‘ఏ స్మూత్‌ ఎగ్జిట్‌ ఫ్రమ్‌ ఎటర్నల్‌ ఇన్‌ఫ్లేషన్‌’  పేరుతో ప్రచురించిన ఈ పత్రాలలో మానవ మనుగడ ఎక్కువ కాలం నిలవదని, వేరే సురక్షితమైన ప్రాంతానికి తరలివెళ్లక తప్పదని తాను ఎప్పటినుంచో చెబుతున్న థియరీకి సంబంధించి వివరణాత్మక విషయాలను పొందుపరిచారు. ‘ఒక పరమాణువు విస్తరించడం వల్లే నేటి విశ్వం ఆవిర్భవించింది. మనకున్న బిగ్‌ బ్యాంగ్‌ థియరీలాగే, ఇతర జీవులకు విశ్వాన్ని పోలిన ఆవాసం తప్పకుండా ఉంటుందని’ అని  స్టీఫెన్‌ తన పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు