విదేశీయుల కట్టడికి ట్రంప్‌ తొలి అడుగు

26 Apr, 2020 05:23 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు వెల్లువెత్తుతున్న విదేశీ వర్కర్లని పూర్తి స్థాయిలో కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే గ్రీన్‌ కార్డులపై అధ్యక్షుడు ట్రంప్‌ తాత్కాలిక నిషేధం విధించారని అధ్యక్షుడి ఇమిగ్రేషన్‌ ఎజెండా రూపకర్త స్టీఫెన్‌ మిల్లర్‌ వెల్లడించారు. అమెరికా వలస విధానంలో భారీగా మార్పులు తీసుకురావడం కోసమే అధ్యక్షుడు తొలుత గ్రీన్‌ కార్డులపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు తీసుకువచ్చారని ట్రంప్‌ తరఫున పనిచేసే కొందరు ప్రతినిధులతో మిల్లర్‌ చెప్పినట్టుగా వాషింగ్టన్‌ పోస్టు కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగాల కోసం వచ్చే వారంతా వారి కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని తీసుకువస్తూ ఉండడంతో వలసదారులు ఎక్కువైపోయారని మిల్లర్‌ పేర్కొన్నారు. అందుకే ఫ్యామిలీ వీసాలను కూడా ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్లకి ఉద్యోగాలు లేకుండా విదేశీయుల్ని ఎందుకు పోషించాలన్నది మిల్లర్‌ విధానంగా ఉంది. 

మరిన్ని వార్తలు