మహిళా మార్చ్‌: ‘మమ్మల్ని భయపెట్టలేరు’!

9 Mar, 2020 14:45 IST|Sakshi
పాకిస్తాన్‌లో మహిళా మార్చ్‌(ఫొటో: రాయిటర్స్‌)

ఇస్లామబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్‌లో ఔరత్‌ మార్చ్‌(మహిళా మార్చ్‌) చేపట్టిన వారిపై సంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు. చెప్పులు, రాళ్లు, ఇటుకలు, కర్రలు విసురుతూ దాడులకు దిగారు. ఆదివారం నాడు వందలాది మంది మహిళలు, పురుషులు ఒక్కచోటకు చేరి ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై అకృత్యాలకు తెరపడాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో తాలిబన్ల మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ.. ఈ నిరసనకారులను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో వారిపై భౌతికదాడులకు దిగేందుకు కార్యకర్తలు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురు స్వల్ప గాయాలపాలయ్యారు. 

ఈ విషయం గురించి మహిళా మార్చ్‌ నిర్వాహకుడు అమర్‌ రషీద్‌ మాట్లాడుతూ... ‘‘మీకు తెలుసా. వారెప్పుడూ ఇలాగే చేస్తారు. అయితే ఇవేమీ మమ్మల్ని భయపెట్టలేవు. వాటి ఎత్తుగడలు, వ్యూహాలు మా పనికి ఎంతమాత్రం అడ్డుకాలేవు’’ అని పేర్కొన్నారు. అదేవిధంగా దాడికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. కాగా సభ్యత, నైతిక విలువలను పాటిస్తూ దేశ వ్యాప్తంగా మహిళా మార్చ్‌ నిర్వహించుకోవచ్చని స్థానిక కోర్టు ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సంప్రదాయవాదులు మాత్రం తమ వైఖరి మార్చుకోలేదు. ఈ క్రమంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు