ఒక టైటానిక్‌.. ఒక కర్పాథియా..

11 Apr, 2018 01:08 IST|Sakshi
ఆర్‌ఎంఎస్‌ కర్పాథియా

మనకు టైటానిక్‌ గురించి తెలుసు.. జాక్, రోజ్‌ల అజరామరమైన ప్రేమ కథ గురించి తెలుసు.. మరి మనకు కర్పాథియా గురించి తెలుసా? ఆ నౌకా సిబ్బంది హీరోచిత గాథ గురించి తెలుసా?
తెలీదా.. అయితే.. తెలుసుకుందాం రండి..

టైటానిక్‌.. దాదాపుగా అందరం చూసిన సినిమానే.. ఇందులో ఆ నౌక భారీ మంచు ఖండాన్ని ఢీకొని మునిగిపోతుంది.. 2,224 మందికిపైగా సిబ్బంది, ప్రయాణికులతో బయల్దేరిన టైటానిక్‌లో 1,500 మందికిపైగా సముద్రంలో మునిగి చనిపోయారు.. మరి మిగిలినవాళ్లు ఎలా బతికారు? ఆర్‌ఎంఎస్‌ కర్పాథియా వల్ల.. ఆ నౌకలోని సిబ్బంది వల్ల.. 1912, ఏప్రిల్‌ 15 తెల్లవారుజామున టైటానిక్‌ సముద్రంలో మునిగిపోయింది.. ఆ సమయంలో కర్పాథియా న్యూయార్క్‌ నుంచి ఆస్ట్రియాకు వెళ్తోంది.. ప్రమాద స్థలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్‌ నుంచి ప్రమాదానికి సంబంధించిన సిగ్నల్‌ వచ్చింది.. దీన్ని ట్రాక్‌ చేసిన కర్పాథియా సిబ్బంది.. హుటాహుటిన రంగంలోకి దిగారు. మంచు ఖండాలతో ప్రమాదకరంగా ఉన్న ఆ మార్గంలో ప్రయాణించి.. అక్కడికి చేరుకున్నారు. వెళ్లే సమయానికే టైటానిక్‌ మునిగిపోయింది. అయినప్పటికీ.. బతికున్న ప్రతి ఒక్కరినీ కాపాడాలన్న లక్ష్యంతో సుమారు 4 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టారు. 705 మంది ప్రయాణికులను కాపాడారు. టైటానిక్‌ తన తొలి, చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఏప్రిల్‌ 10తో 106 ఏళ్లు అయిన సందర్భంగా.. కర్పాథియా సహాయక చర్యలకు సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అవే ఇవీ.. 

తానూ టైటానిక్‌లాగే..
టైటానిక్‌కు సంబంధించిన వందల మంది ప్రయాణికులను కాపాడిన కర్పాథియా నౌక కూడా తర్వాతి కాలంలో టైటానిక్‌లాగే మునిగిపోయింది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో.. అంటే 1918, జూలై 17న ఐర్లాండ్‌ సముద్ర జలాల్లో ఉండగా.. జర్మన్‌ సబ్‌మెరైన్‌ దీనిపైకి టార్పెడోలు ప్రయోగించడంతో పేలుడు ధాటికి సముద్రంలో మునిగిపోయింది.    -సాక్షి, తెలంగాణ డెస్క్‌

మరిన్ని వార్తలు