పొద్దున్నే లేస్తా.. కొత్త భాష మాట్లాడుతా!

18 Feb, 2018 04:02 IST|Sakshi

ఉదయం నిద్ర లేచిన వ్యక్తి రాత్రి పడుకునే వ్యక్తి వేర్వేరు అని అంటుంటారు. అలా ఎలా అంటే ఆ రోజు మొత్తం ఏదో ఒకకొత్త విషయాన్ని నేర్చుకుంటాం కాబట్టి ఓ కొత్త వ్యక్తిగా పడుకుంటాం అన్నమాట. అయితే రాత్రి పడుకుని ఉదయం లేచే సరికి అదే మార్పు ఉంటుందా.. సాధారణంగా అందరి సంగతేమో కానీ అమెరికాలోని అరిజోనాకు చెందిన 45 ఏళ్ల మిషెల్‌ మైర్స్‌ మాత్రం పూర్తిగా మారిపోయింది! మారిపోవడం అంటే ఆమె రూపురేఖలు మారడం కాదు. ఆమె భాష..! ఆ అందులో విశేషం ఏముంది.. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ క్లాస్‌లకో.. లేదా 30 రోజుల్లో వేరే భాష నేర్చుకునే పుస్తకం చదువుతోందో అని పొరపడకండి.

అది కూడా కనీసం ఆ భాషలు.. యాసలు ఉంటాయని కూడా ఆమెకు తెలియదట. ఓ రోజు రాత్రి తనకు నొప్పిగా ఉందని పడుకోవడం.. తెల్లారి లేచే సరికి వేర్వేరు భాషలు, యాసల్లో మాట్లాడటం.. ఇలా 2015 నుంచి జరుగుతోందట. ఆస్ట్రేలియన్, ఐరిష్, బ్రిటిష్‌ యాసలు మాట్లాడుతోందట. ఇలా వేరే భాష మాట్లాడటం వారం.. రెండు వారాల పాటు ఉండేదట. బ్రిటిష్‌ యాస మాత్రం రెండేళ్లుగా మాట్లాడుతోందట. ఇదో వింత వ్యాధి. దీని పేరు ఫారిన్‌ యాక్సెంట్‌ సిండ్రోమ్‌.

మెదడులోని బేసల్‌ గాంగ్లియాన్‌ భాగానికి దెబ్బ తగిలినప్పుడు కానీ.. షాక్‌ తగిలినప్పుడు కానీ ఇలా భాషలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని షెలియా బ్లూమ్స్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే బాధపడుతాం.. కానీ ఈ వ్యాధి వచ్చినందుకు మిషెల్‌ సంతోషపడుతోంది కావొచ్చు.. ఎంతైనా కోచింగ్‌ లేకుండా.. పైసా ఖర్చు లేకుండా కొత్త భాషలు నేర్చుకోవడమంటే కాస్త అదృష్టమే కదూ! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారు 60 మంది మాత్రమే ఉన్నారని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ పేర్కొంది.

మరిన్ని వార్తలు