వీధి దీపాలకు బదులు.. కాంతినిచ్చే మొక్కలు..!

14 Dec, 2017 19:13 IST|Sakshi
పుస్తకం చదవడానికి వీలైనంత కాంతిని వెలువరిస్తున్న వాటర్‌క్రెస్‌ మొక్క

వాషింగ్టన్‌ : త్వరలో రోడ్లపై వీధి దీపాలకు బదులు వెలుగులు అందిస్తున్న మొక్కలు మీకు కనిపించొచ్చు!. అవును. ఈ దిశగా మసాచూసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు ముందడుగు వేశారు. కృత్రిమ కాంతి(బయో లుమినిసెంట్‌)ని అభివృద్ధి చేయాలనే యోచనలో భాగంగా చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 

వాటర్‌క్రెస్‌ మొక్కల ఆకులకు ప్రత్యేకమైన నానో పదార్థ తంత్రులను పూసిన పరిశోధకులు చీకట్లో అది వెలుగులు విరజిమ్మడాన్ని గుర్తించారు. నానో పదార్థ తంత్రుల ఎఫెక్ట్‌తో వాటర్‌క్రెస్‌ మొక్క దాదాపు నాలుగు గంటల పాటు వెలుగును ఇచ్చినట్లు చెప్పారు. మొక్క నుంచి వెలువడిన కాంతితో పుస్తకాన్ని చదవగలిగామని తెలిపారు. ఇదే తరహాలో పెద్ద మొక్కలపై ప్రయోగాలు చేసి పెద్ద ఎత్తున కృత్రిమ కాంతిని సృష్టించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఎలా పని చేస్తుంది?
‘లుసిఫెరాసిస్‌’ అనే నానో పదార్థ తంత్రువు కృత్రిమ కాంతి సృష్టిలో కీలకపాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ఈ లుసిఫెరాసిస్‌ను స్వయం ప్రకాశిత జీవుల్లో పరిశోధకులు గుర్తించారు. దానిపై అనేక పరిశోధనలు జరిపి కెమికల్‌ రియాక్షన్‌ ద్వారా లుసిఫెరాసిస్‌ను ‘ఆక్సీలుసిఫెరిన్‌’గా మార్చారు. ఆక్సీలుసిఫెరిన్‌ నుంచి ఉద్దాతమైన కాంతి వెలువడుతుండటంతో కృత్రిమ కాంతిని సృష్టించొచ్చనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు.

అనంతరం వాటర్‌క్రెస్‌ మొక్కలపై ప్రయోగాలు చేసి సఫలీకృతులయ్యారు. కృత్రిమ కాంతిని మానవాళికి అందుబాటులోకి తెస్తే వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతాన్ని భారీగా తగ్గించొచ్చు. దీంతో గ్లోబల్‌ వార్మింగ్‌ మహమ్మారిని అరికట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.  

మరిన్ని వార్తలు