ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం...

5 Apr, 2020 04:11 IST|Sakshi

భారీగా పెరగని కరోనా కేసులు..

రాష్ట్రాలవారీ లెక్కల్లో తొలి స్థానం నుంచి పదో స్థానానికి

సత్ఫలితాలిస్తున్న జరిమానాల నిబంధన

బయటకొచ్చినా సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు

అందరి సహకారంతోనే సాధ్యమైందన్న వర్సిటీ ప్రొఫెసర్‌  

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో మొట్టమొదటగా కరోనా మహమ్మారి బారినపడిన వాషింగ్టన్‌ రాష్ట్రంలో కేసుల తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల కేసుల సంఖ్యాపరంగా తొలి స్థానం నుంచి పదో స్థానానికి పరిమితమైంది. శనివారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల జాబితాను పరిశీలిస్తే వాషింగ్టన్‌ స్టేట్‌ పదో స్థానంలో నిలిచింది. మార్చి మూడో వారంలో 3,250 కేసులతో మొదటి స్థానంలో ఉన్న వాషింగ్టన్‌ స్టేట్‌ ఇప్పుడు 6,966 కేసుల దగ్గర ఆగిపోయింది.

అదే సమయంలో వంద కంటే తక్కువ కేసులు నమోదై కేసుల జాబితాలో చిట్టచివరన ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ ఇప్పుడు కరోనా కేసులకు కేంద్రబిందువయ్యాయి. తాజాగా న్యూయార్క్‌లో 1,03,476, న్యూజెర్సీలో 29,895 కేసులు నమోదయ్యాయి. మార్చి మూడో వారంలో 5 వేల కేసులతో రెండో స్థానంలో ఉన్న కాలిఫోర్నియా ఇప్పుడు 12,581 కేసులతో మూడు స్థానంలో ఉంది. వాషింగ్టన్‌ ప్రభుత్వానికి, పోలీసులకు అక్కడి ప్రజలు సంపూర్ణంగా సహకరించడం వల్లే కేసులు పెరగలేదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా రివర్‌సైడ్‌ కల్చరల్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ టోబీ మిల్లర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన 4 రోజులపాటు సియాటిల్‌లో ఉన్నారు.

టోబీ మిల్లర్‌ ఏమన్నారంటే...
‘నేను అనుకోకుండా సియాటిల్‌లో లాక్‌డౌన్‌ కావా ల్సి వచ్చింది. వారంపాటు అక్కడే ఉన్నా. సియాటిల్‌లో ప్రజలు రోడ్లపైకి రాకపోవడం, వచ్చినా పోలీసులు వారిని ఇళ్లకు తిప్పి పంపడం చూశా. సియాటిల్‌ పోలీసు చీఫ్‌తో కలసి ఓ రోజంతా కింగ్‌కౌంటీ ప్రాంతంలో తిరిగా. అబ్బురం అనిపించింది. ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం వచ్చింది. నిత్యావసర సరుకుల స్టోర్స్‌కు కూడా గంటకు 10–15 మంది ప్రజలు, అది కూడా 5 మీటర్ల సామాజిక దూరం పాటిస్తూ సరుకులు కొనుగోలు చేయడం చూశా. కరోనా మార్చి 30న ఇంతటి భయంకరమైన అనుభవాన్ని ఇస్తుందని ఆ రోజున (మార్చి 19న) అనుకోలేదు.

అయినా ఆ రోజు నేను తిరిగిన కింగ్‌కౌంటీలోని సియాటిల్, కిర్క్‌లాండ్, కెంట్, రెడ్‌మాండ్, ఫెడరల్‌ వే, మ్యాపిల్‌ వ్యాలీలో జనం బయటకు రావడానికి భయపడ్డారు. ఈ రోజు నాకు అనిపిస్తోంది. అక్కడి పాలకులు, పోలీసులు, ప్రజలు ప్రదర్శించిన పరిణతిని అమెరికాలో మరెక్కడా చూడలేదు. తిరిగి నేను రివర్‌సైడ్‌ (కాలిఫోర్నియా) వచ్చిన తరువాత కూడా దాదాపు అదే స్థాయిలో లాక్‌డౌన్‌ అమలవుతున్నా కింగ్‌కౌంటీ తరహాలో మాత్రం లేదు. ఇవ్వాళ న్యూయార్క్, న్యూజెర్సీతోపాటు అనేక రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ఈ విపత్తును చూస్తుంటే వాషింగ్టన్‌ స్టేట్‌ గ్రేట్‌. కాలిఫోర్నియాలో కొంతలో కొంత బెటర్‌’ అని ప్రొఫెసర్‌ టోబీ మిల్లర్‌ పేర్కొన్నారు.

మొట్టమొదట లాక్‌డౌన్‌ అయ్యింది ...
కరోనా కేసుల వ్యాప్తి ప్రారంభం కావడంతోనే వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలు మార్చి మొదటి వారంలోనే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కాలిఫోర్నియాలో 4 కోట్ల మంది, వాషింగ్టన్‌లో 76 లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్‌ సహా వందల కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ వెసులుబాటు కల్పించాయి. పని లేకుండా రోడ్లపైకి వస్తే పోలీసులు టికెట్‌ (జరిమానా) వేయడం ప్రారంభించారు. 100 నుంచి 400 డాలర్ల జరిమానా విధించారు. దీంతో ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల దగ్గరకు వెళ్లినప్పుడు 3 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఇంటికి ఒకరిద్దరు కాకుండా ఒక కమ్యూనిటీలో ఉండేవారు 4–5 కుటుంబాలకు అవసరమైన వస్తువుల కోసం ఒక్కరే వెళ్తుండేవారు. ‘ఇంత చేసినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

కానీ ఇక్కడి పోలీసులు ఈమాత్రం కట్టడి చేయకపోతే 4 కోట్ల మందిలో ఎంతమందికి ఈ వ్యాధి సోకి ఉండేదో తలుచుకుంటేనే భయంకరంగా ఉంది’అని మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగిని పుచ్చలపల్లి సరస్వతి అన్నారు. సియాటిల్‌లో ఉంటున్న సరస్వతి కుటుంబం నెల రోజులుగా ఇంటి బయటకు రాలేదు. కాలిఫోర్నియాలోనూ ప్రజలు భయం భయంగానే బతుకుతున్నారు. అక్కడా నెల రోజులుగా లాక్‌డౌన్‌. మామూలుగా అయితే న్యూయార్క్‌ మాదిరే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఈ కారణంగానే వైరస్‌ వ్యాప్తి చెందింది. కఠినమైన లాక్‌డౌన్‌ కారణంగా 10 వేల కేసుల దగ్గర ఉన్నామని, న్యూయార్క్, న్యూజెర్సీ మాదిరి ఇక్కడ కూడా ఆంక్షలు లేకపోతే కేసులు లక్షల్లో ఉండేవని శాన్‌ఫ్రానిస్‌స్కో సమీపంలోని హేవార్డ్‌లో ఉంటున్న సిద్దూ పొలిశెట్టి అన్నారు. ట్విట్టర్‌ కార్యాలయంలో పనిచేసే సిద్దు నెల రోజులుగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు.

► ఈ ఏడాది ఫిబ్రవరి 26న షాంగై నుంచి సియాటిల్‌ (వాషింగ్టన్‌ స్టేట్‌) వచ్చిన ఓ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అమెరికాలో నమోదైన తొలి కేసు అదే.
► ఫిబ్రవరి 28న ఇరాన్‌ నుంచి వచ్చిన 72 ఏళ్ల వ్యాపారి సియాటిల్‌లో కరోనాతో మృతి చెందాడు. అమెరికాలో నమోదైన తొలి కరోనా మరణం అది.
► మార్చి 5 నాటికి సియాటిల్‌లో నమోదైన కేసుల సంఖ్య వందకు పెరిగింది. అదే సమయంలో కాలిఫోర్నియాలో  17 కేసులు నమోదయ్యాయి.
► మార్చి 11 నాటికి సియాటిల్‌ (కింగ్‌ కౌంటీ)తోపాటు స్నోహోమిష్‌ కౌంటీలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 1,300పైనే. కాలిఫోర్నియా (సిలికాన్‌ వ్యాలీ)లోనూ వేగంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. మార్చి 14న వాషింగ్టన్‌లో 2,675, కాలిఫోర్నియాలో 1,778 కేసులు నమోదయ్యాయి.
► ఈ రెండు రాష్ట్రాల్లో వేగంగా కేసులు పెరిగిపోతున్న దశలో అమెరికాలో ఏ రాష్ట్రంలోనూ (న్యూయార్క్, న్యూజెర్సీ) కేసుల సంఖ్య వంద దాటలేదు.
► కానీ తాజా లెక్కల ప్రకారం వాషింగ్టన్‌ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు