అమెరికాకు ఉత్తర కొరియా ఘాటు హెచ్చరిక

24 Sep, 2017 09:53 IST|Sakshi

న్యూయార్క్‌: బద్ధ విరోధులైన అమెరికా, ఉత్తర కొరియా మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాకు ఉత్తర కొరియా ఘాటు హెచ్చరికలు జారీచేసింది. అమెరికా ప్రధాన భూభాగంపై దాడులు అనివార్యమని హెచ్చరించింది. తమ దేశాధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను 'లిటిల్‌ రాకెట్‌ మ్యాన్‌' అంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ తిట్టినందుకు ప్రతీకారంగా దాడులు చేస్తామని తెగేసి చెప్పింది.

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడేందుకు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హో పొడియం వద్దకు రాగానే.. అమెరికా బాంబర్లు, ఫైటర్‌ జెట్లు ఉత్తర కొరియా తీరం మీదుగా దూసుకుపోయాయి. కొరియాకు తమ ఆయుధ బలాన్ని చాటేందుకు అమెరికా ఆర్మీ ఈ విధంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. ఇరుదేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు తారాస్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు రి యాంగ్‌ మాట్లాడుతూ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. కిమ్‌ను అవమానపరిచేలా ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలకు ప్రతిఫలంగా కొరియా రాకెట్లు త్వరలోనే అమెరికా ప్రధాన భూభాగాన్ని సందర్శించబోతున్నాయని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు