భారీ భూకంపం.. భయంతో జనాల పరుగులు

23 Jan, 2018 16:44 IST|Sakshi

జకర్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి రాజధాని జకర్తా భయంతో వణికిపోయింది. పలు భవనాలు, ఇతర నిర్మాణాలు ప్రకంపనలకు గురయ్యాయి. కొన్ని సెకన్లపాటు తొణికిసలాడినట్లుగా కనిపించాయి. దీని కారణంగా వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నవారంతా భయంతో బయటకు పరుగులు తీయగా వాహనాలు నడుపుతున్నవారంతా వాటిని ఎక్కడికక్కడే ఆపేశారు. బైక్‌లు నడుపుతున్నవారైతే తమ వాహనాలు వదిలేసి పరుగులు పెట్టారు.

అధికారుల వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. జకర్తాకు 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జకర్తాలో 10 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా కూడా ఈ భూకంపం కారణంగా ఆందోళనపడినట్లు అధికారులు చెప్పారు. దీని తీవ్రత గురించి కొంతమంది తమ అనుభవాలను వెల్లడిస్తూ 'నేను ఒక భవనంలో కూర్చొని ఉన్నాను. అప్పుడే అనూహ్యంగా అది కదలడం మొదలుపెట్టింది. వెంటనే నేను బయటకు పరుగులు తీశాను. ఈసారి వచ్చిన భూకంపం చాలా బలంగా అనిపించింది. గతంలో నేనెప్పుడు ఇలాంటిది చూడలేదు' అని సుజీ (35) అనే కార్మికుడు తెలిపాడు.

మరిన్ని వార్తలు