టీచర్‌కు బుడతడు రాసిన లేఖ వైరల్‌

18 Feb, 2019 15:03 IST|Sakshi

కాలిఫోర్నియా : ఎందుకు హోం వర్క్‌ చేయలేదని టీచర్‌ దబాయిస్తే జ్వరమొచ్చిందనో లేక ఏదో ఒక సాకుతో కవర్‌ చేసే చిన్నారులను తరచూ చూస్తుంటాము. అయితే ఓ బుడతడు మాత్రం ఏమాత్రం బెరుకులేకుండా తన టీచర్‌కు ఎందుకు హోం వర్క్‌ చేయలేదో వివరిస్తూ రాసిన ఓ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. లిదియా అనే ఓ యువతి తన కజిన్‌ కుమారుడు ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ తన టీచర్‌కు రాసిన లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. తన కజిన్‌కి ఎడ్వర్డ్ టీచర్‌ ఈమెయిల్‌ ద్వారా లేఖను పంపారని పేర్కొంది. కనీసం వెయ్యిమంది కూడా ఫాలోవర్లులేని అమె ట్వీట్‌కు దాదాపు లక్ష రీట్వీట్లు, మూడు లక్షల యాభై వేల లైకులు వచ్చాయి. 

కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ వీకెండ్‌లో తన టీచర్‌ ఇచ్చిన హోం వర్క్‌ను చేయలేదు. మరుసటి రోజు స్కూలుకు వెళ్లిన  అతనికి హోం వర్క్‌ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ టీచర్‌ నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. మాట్లాడకుండా నిలుచున్న అతనికి ఓ తెల్లకాగితం ఇచ్చి ఎందుకు హోం వర్క్‌ చేయలేదో రాసివ్వాలంటూ ఆ టీచర్‌ ఆదేశించింది. 

దానికి ఆ విద్యార్థి .. నేను హోంవర్క్ ఎందుకు చేయలేదంటే, వీకెండ్‌లో స్కూల్ వర్క్‌ని ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు. వీకెండ్ ఉండేది స్ట్రెస్‌లేకుండా స్నేహితులతో ఆడుకుని ఎంజాయ్ చేయడానికి, టీవీ చూడడానికి, గేమ్స్‌ ఆడుకోవడానికి. నాకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేస్తా అంటూ ఎలాంటి బెరుకు లేకుండా తనకు తోచింది రాశాడు. హోంవర్క్ అనేది ఉపయోగం లేదు కాబట్టి, స్టూడెంట్ వర్సెస్ హోంవర్క్ కేసులో ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ వాదనకు కోర్టు మద్దతుగా నిలిచింది. ఇక కేసు క్లోజ్ అయింది అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆ బుడతడు ఇచ్చిన సమాధానం చూసి ఆ టీచర్ షాక్ అయితే, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి వాదన చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

మరిన్ని వార్తలు