ఆ విద్యార్ధులకు బంపర్‌ ఆఫర్‌

20 May, 2019 15:30 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఎల్‌కేజీకే రూ లక్షల్లో ఫీజులు చెల్లించి ఆయా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దిక్కులు చూస్తున్న క్రమంలో ప్రతిష్టాత్మక అమెరికన్‌ కాలేజ్‌లో విద్యార్ధుల రుణాలన్నీ చెల్లించేందుకు ఓ వ్యాపార దిగ్గజం ముందుకు రావడం అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. 440 కోట్ల డాలర్ల సంపద కలిగిన ఆఫ్రికన్‌ -అమెరికన్‌ వాణిజ్యవేత్త రాబర్ట్‌ ఎఫ్‌ స్మిత్‌ అట్లాంటాలోని బ్లాక్‌​ మోర్‌హౌస్‌ కాలేజ్‌లో కొత్తగా డిగ్రీ పట్టా అందుకున్న విద్యార్ధుల రుణం మొత్తం ( దాదాపు రూ 250 కోట్లు) తాను చెల్లిస్తానని చెప్పి విద్యార్ధులు, తల్లితండ్రుల మన్ననలు పొందారు.

విద్యార్ధుల రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన నిధిని సమకూరుస్తానని స్మిత్‌ 400 మంది గ్రాడ్యుయేట్లు, వారి తల్లితండ్రుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. మీ విద్యార్ధుల రుణాన్ని మాఫీ చేసేలా తమ కుటుంబం నిధులు మంజూరు చేస్తుందని గ్రాడ్యుయేషన్‌ మీట్‌లో స్మిత్‌ పేర్కొన్నట్టు కాలేజ్‌ ట్విటర్‌ ఖాతా వెల్లడించింది. ఈ కాలేజ్‌ నుంచి స్మిత్‌ గౌరవ పట్టా పొందుతూ తన ఔదార్యం చాటారు. తనలాంటి ఎందరో బ్లాక్‌ అమెరికన్ల ఉన్నతికి తన సాయం భరోసా అందించాలనే సంకల్పమే ఈ ప్రకటనకు తనను పురిగొల్పిందని స్మిత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు