చూయింగ్‌ గమ్‌తో క్యాన్సర్‌!

16 May, 2019 10:19 IST|Sakshi

సిడ్నీ: చూయింగ్‌ గమ్‌ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా చిన్నారులు వీటిని ఎక్కువగా తింటుంటారు. అయితే రుచికి తియ్యగా ఉండే ఈ చూయింగ్‌ గమ్‌ల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చూయింగ్‌ గమ్‌ వల్ల కలిగే దుష్పభ్రావాలపై పరిశోధనలు చేశారు. చూయింగ్‌ గమ్‌లు, మేయోన్నైస్‌ (గుడ్డు, వెనిగర్‌తో తయారు చేసే క్రీములు)లను నిత్యం తీసుకోవడం వల్ల కొలన్‌ క్యాన్సర్‌ (పేగులకు వచ్చే క్యాన్సర్‌) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. 

ఎలుకలపై పరిశోధనలు చేసిన తరువాత శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. చూయింగ్‌ గమ్‌లో ‘ఈ171’ (టైటానియమ్‌ డైఆక్సైడ్‌ నానోపార్టికల్స్‌) అనే పదార్థం ఉంటుంది. చూయింగ్‌  గమ్‌ తరచూ తినడం వల్ల వీటి నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా మన పేగుల్లోకి చేరుతుంది. క్రమంగా అది పేగులకు హాని చేస్తూ క్యాన్సర్‌గా మారుతుందని పరిశోధనలో గుర్తించారు. ఆహారం, మందులు.. తెలుపు రంగులో ఉండేందుకు ‘ఈ171’ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే  ‘ఈ171’ వాడే పదార్థాలకు దూరంగా ఉండడమే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు