ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇజ్రాయెల్‌‌ స్టడీ

9 Jun, 2020 09:08 IST|Sakshi

జెరూసలేం: ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చైనా వాల్‌ గురించి ఇజ్రాయెల్‌‌ ఆర్కియాలజిస్ట్‌లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చైనా వాల్‌ ఉత్తర భాగాన్ని ఆక్రమణలను నిరోధించడానికి కాదని.. పౌరులను పర్యవేక్షించే నిమిత్తం నిర్మించినట్లు వారు తెలిపారు. పరిశోధకులు మొదటిసారి 740 కిలోమీటర్ల పొడవైన చైనా వాల్‌ ఉత్తరభాగాన్ని పూర్తిగా మ్యాప్‌ చేశారు. వారి పరిశోధనలో తెలిసిన అంశాలు మునుపటి పరిశీలనలను సవాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో రెండేళ్లుగా ఈ పరిశోధనలకు అధ్యక్షత వహించిన జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన గిడియాన్ షెలాచ్ లావి మాట్లాడుతూ.. ‘మా పరిశోధనకు ముందు, చెంఘిజ్ ఖాన్ సైన్యాన్ని ఆపడం కోసమే ఉత్తర భాగంలో గోడ నిర్మాణాన్ని చేపట్టినట్లు చాలా మంది భావించారు. కానీ ఈ భాగం లోతు తక్కువగా ఉన్న మంగోలియాలోని రహదారులకు సమీపంగా ఉంది. మా పరిశోధనలు తేల్చిన అంశం ఏంటంటే.. ఈ ఉత్తర భాగాన్ని సైనికేతర పనుల కోసం అనగా ప్రజలు, పశువుల కదలికలను పర్యవేక్షించడం, నిరోధించడం.. వాటికి పన్ను విధించడం వంటి కార్యక్రమాల కోసం నిర్మించారు’ అని తెలిపారు. షెలాచ్-లావి, అతని ఇజ్రాయెల్‌, మంగోలియన్, అమెరికన్ పరిశోధకుల బృందం గోడలను మ్యాప్ చేయడానికి డ్రోన్లు, అధిక-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు, సాంప్రదాయ పురావస్తు సాధనాలను ఉపయోగించింది.

వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్‌ చైనా నిర్మాణం మొదట క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ప్రారంభమై.. శతాబ్దాలుగా కొనసాగింది. పురాణ మంగోలియన్ విజేతకు చిహ్నంగా ‘చెంఘిజ్ ఖాన్ వాల్’ అని పిలవబడే ఉత్తర భాగం 11, 13 వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఇది 72 చిన్న చిన్న నిర్మాణాలతో నిండి ఉంది. 

మరిన్ని వార్తలు