భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగితే.. నాగరికత అంతమే!

11 Dec, 2013 01:43 IST|Sakshi
భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగితే.. నాగరికత అంతమే!

  ఐపీపీఎన్‌డబ్ల్యూ అధ్యయనం హెచ్చరిక
  ఈ రెండు దేశాల అణుయుద్ధం..
  200 కోట్ల మందికి మరణశాసనం
 100 అణ్వాయుధాలు వాడినా ప్రపంచంపై ప్రభావం

 
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య అణుయుద్ధమంటూ జరిగితే.. దాని ఫలితంగా ప్రపంచంలో తీవ్ర కరువు తలెత్తుతుందని.. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది అంటే 200 కోట్ల మంది హతమైపోతారని.. మానవ నాగరికత ముగిసిపోతుందని ఒక అధ్యయనం హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న అణ్వాయుధాల్లో కేవలం కొన్నిటిని అణు యుద్ధంలో ఉపయోగించినా కూడా.. ఇంతకుముందు ఊహించినదానికంటే ప్రపంచ స్థాయిలో భారీ మరణాలు సంభవిస్తాయని ‘అణుయుద్ధ నివారణ కోసం అంతర్జాతీయ వైద్యులు (ఐపీపీఎన్‌డబ్ల్యూ)’ అనే స్వచ్ఛంద సంస్థ సహ అధ్యక్షుడు.. అధ్యయన రచయిత ఐరా హెల్ఫాండ్ పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఇదే సంస్థ 2012లో నిర్వహించిన అధ్యయనంలో అణుయుద్ధం జరిగితే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది మృత్యువాత పడతారని అంచనా వేశారు. భూ వాతావరణం, ఇతర పర్యావరణ వ్యవస్థలపై అణు విస్ఫోటనాల ప్రభావం గురించి అంచనా వేసిన వాతావరణ శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో ఎక్కడైనా సరే 100 అణ్వాయుధాలను ఉపయోగించినట్లయితే.. అది ప్రపంచ వాతావరణానికి, వ్యవసాయ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని.. దాని ఫలితంగా 200 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 100 కోట్ల మంది చనిపోవటమంటే.. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని విపత్తే అవుతుందని ఈ అధ్యయనం చెప్తోంది. దీనికితోడు చైనాలో మరో 130 కోట్ల మంది ప్రమాదంలో పడినట్లయితే.. అది మానవ నాగరికత అంతానికి ఆరంభమేనని హెల్ఫాండ్ అభివర్ణించారు.

భారత్ - పాక్‌ల మధ్య అణుయుద్ధం ప్రభావంతో.. ప్రపంచంలో అతి పెద్ద దేశమైన చైనాలో గోధుమల ఉత్పత్తి తొలి ఏడాది సగానికి పడిపోతుందని.. దశాబ్ద కాలంలో సగటున 31 శాతం పడిపోతుందని పేర్కొన్నారు. అలాగే గోధుమలు ఉత్పత్తి చేసే ఇతర దేశాల్లోనూ ఈ పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీని ఫలితంగా సగానికిపైగా ప్రజల్లో ఆకలి, పర్యవసానంగా సామాజిక సంక్షోభం అనూహ్యంగా పెరిగిపోతాయని.. ఇది మొత్తం ప్రపంచ సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ‘ఈ ముప్పును రూపుమాపాలంటే.. మనం అణ్వాయుధాలను రూపుమాపాల్సిందే’ అని హెల్ఫాండ్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు