కరోనా వ్యాక్సిన్‌: ఆశాజనకంగా పరీక్షలు

15 Jul, 2020 16:21 IST|Sakshi

కోవిడ్‌-19పై పోరాడే ఇమ్యూనిటీ పెంపు

వాషింగ్టన్‌ : కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. అమెరికన్‌ బయోటెక్‌ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై జరిపిన పరీక్షలో​సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించగా కరోనా వైరస్‌ను పోరాడే వ్యాధి నిరోధక శక్తి వారిలో పెంపొందిందని వెల్లడైంది. అయితే చాలా మందిలో ఇది స్వల్ప సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించినట్టు గుర్తించారు. మానవ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక దశలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ పనితీరుపై తాజా అథ్యయనం ఈ వివరాలు తెలిపింది. వ్యాక్సిన్‌ పరీక్షలో ప్రాథమికంగా వెల్లడైన అంశాలను ది న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు. అమెరికాలోని సీటెల్‌, ఎమరీ యూనివర్సిటీలో జరిగిన వ్యాక్సిన్‌ పరీక్షలో పాల్గొన్న తొలి 45 మంది వాలంటీర్ల స్పందనపై ఈ అథ్యయనం చేపట్టారు.

ఈ అథ్యయనం ప్రకారం మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారందరిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీని కలిగించిందని వెల్లడైంది. భద్రతా పరమైన అంశాలు కూడా ఏవీ తలెత్తలేదని అథ్యయనం గుర్తించింది. మానవ శరీరంలోకి ప్రవేశించే కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ లక్ష్యంగా యాంటీబాడీలను తటస్ధీకరించేలా మొడెర్నా వ్యాక్సిన్‌ను డిజైన్‌ చేశారని వాషింగ్టన్‌ హెల్త్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పలువురిలో స్వల్ప సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయని, వ్యాక్సినేషన్‌ తర్వాత ఇది సహజమని పరిశోధకులు తెలిపారు. 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో వెల్లడైన ఫలితాలనే ఈ అథ్యయనంలో ప్రస్తావించారు. ఇక ఈనెలలోనే మూడో దశ పరీక్షలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐఏఐడీ)తో కలిసి మోడెర్నా అభివృద్ధి చేస్తోంది. చదవండి : జైడస్‌ క్యాడిలా క్లినికల్ పరీక్షలు షురూ

మరిన్ని వార్తలు