ఆ బ్లడ్‌ గ్రూపు వాళ్లు తస్మాత్‌ జాగ్రత్త!

18 Mar, 2020 21:03 IST|Sakshi

బీజింగ్‌ : ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల కరోనా పాజటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 8 వేల మందికి పైగా మృతిచెందారు.  రోజురోజుకు కరోనా మృతులు పెరుగుతున్న వేళ.. ఈ వైరస్‌కు సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా చైనాలో కరోనా సోకిన 2,000 మంది రక్త నమునాలను పరీక్షించగా.. బ్లడ్‌ గ్రూప్‌ ఏ ఉన్నవారికి ఈ వైరస్‌ వల్ల ఎక్కువ హాని కలిగే అవకాశం ఉన్నట్టుగా తేలింది. వుహాన్‌ యూనివర్సిటీ జోంగ్‌నాన్‌ హాస్పిటల్‌లోని సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ విభాగానికి చెందిన జింగ్‌హువాన్‌ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. 

బ్లడ్‌ గ్రూపు ఏ కలిగినవారికి కరోనా వైరస్‌ సంక్రమణ రేటు అధికంగా ఉంటుందని, తీవ్రమైన లక్షణాలు కనబడతాయని పరిశోధకులు తెలిపారు. మరోవైపు బ్లడ్‌ గ్రూపు ఓ కలిగిన వారికి తేలికపాటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. బ్లడ్‌ గ్రూపు ఏ కలిగిన వ్యక్తులు కరోనా సంక్రమించకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ వారికి వైరస్‌ సోకితే ఎక్కువ నిఘాతో పాటు ఇతరులతో పోల్చితే మరింత మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. వుహాన్‌లో కరోనా బారినపడి మరణించిన 206 మందిలో బ్లడ్‌ గ్రూప్‌ ఏ కలిగినవారు 85 మంది, బ్లడ్‌ గ్రూప్‌ ఓ కలిగినవారు 52 మంది ఉన్నారని ఆ స్టడీలో పేర్కొన్నారు. 

ఈ పరిశోధనపై టియాంజిన్‌లోని స్టేట్‌ కీ లాబోరేటరీ ఆఫ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ హెమటాలజీ పరిశోధరకుడు గావో యింగ్‌డాయ్‌ మాట్లాడుతూ.. ‘ఇందులో భయపడాల్సిన అవసరమేమి లేదు. బ్లడ్‌ గ్రూపు ఏ కలిగినవారికి 100 శాతం వైరస్‌ సంక్రమిస్తుందని దీని అర్థం కాదు. అలాగే బ్లడ్‌ గ్రూప్‌ ఓ కలిగినవారికి వైరస్‌ పూర్తిగా సురక్షితమని కూడా కాదు. ప్రతి ఒక్కరు అధికారులు చెప్పే జాగ్రత్తలు తీసుకుంటూ.. చేతులను ఎప్పటికీ శుభ్రపరుచుకుంటూ ఉండాలి’ అని తెలిపారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో ఇప్పటివరకు 151 మందికి సోకినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

చదవండి : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు

సిటమాల్‌ మింగి.. దర్జాగా ఇంటికి..!

మరిన్ని వార్తలు