‘అధిక ఉష్ణోగ్రత కరోనాను అడ్డుకోదు’

19 May, 2020 19:41 IST|Sakshi

వేసవిలో మహమ్మారి నెమ్మదించదు

లండన్‌ : పెద్దసంఖ్యలో ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోగలగడం ద్వారానే కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని, వాతావరణ మార్పులతో దీన్ని నియంత్రించలేమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. వేడి, శీతల వాతావరణం కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రభావం చూపవని తెలిపింది. కోవిడ్‌-19 తొలి దశ వ్యాప్తిని ప్రస్తుత వేసవి గణనీయంగా నియంత్రిస్తుందని తమ అథ్యయనంలో వెల్లడి కాలేదని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. గట్టి నియంత్రణ చర్యలు చేపట్టకుండా అధిక ఉష్ణోగ్రతలు, వేసవి వాతావరణం వైరస్‌ వృద్ధిని పరిమితం చేయబోవని సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అథ్యయనం పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పటికీ వైరస్‌ ప్రభావానికి లోనయ్యే ముప్పును కలిగిఉన్నారని పరిశోధకులు హెచ్చరించారు. ప్రస్తుత ఇన్ఫెక్షన్‌ రేటు వృద్ధిలో వాతావరణ పరిస్ధితుల వల్ల ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదని గుర్తించామని చెప్పారు. వైరస్‌ను ఎదుర్కోగల రోగనిరోధక శక్తిని పెద్దసంఖ్యలో ప్రజలు అందిపుచ్చుకుంటేనే వాతావరణం ప్రభావం దానిపై ఉంటుందని, కోవిడ్‌-19 విషయంలో ప్రజలకు ఇంకా ఇలాంటి ఇమ్యూనిటీ లేదని అథ్యయనం స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని అథ్యయన రచయిత డాక్టర్‌ రాచెల్‌ బెకర్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ లేకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించని క్రమంలో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టదని స్పష్టం చేశారు.

చదవండి : అమెరికా వెంటిలేటర్లు వచ్చేస్తున్నాయ్‌..

మరిన్ని వార్తలు