తెలుగమ్మాయి.. అంతర్జాతీయ స్థాయికి..!

15 Sep, 2017 11:22 IST|Sakshi
తెలుగమ్మాయి.. అంతర్జాతీయ స్థాయికి..!

సక్సెస్‌ అబ్రాడ్‌
పిల్లల భవిష్యత్తు మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షిస్తారు. ఇదే విధంగా ఆలోచించారు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన బోయ కృష్ణ, వెంకట లక్ష్మి దంపతులు. తమ ముగ్గురు పిల్లలను ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివించలేని పేదరికం వారిది. దీంతో ఇద్దరు కుమారులను ప్రభుత్వ పాఠశాలకు పంపి.. కూతుర్ని మాత్రం ప్రైవేటు స్కూల్‌లో చదివించారు. ఇది వారి బంధువులను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ అమ్మానాన్నకు తమ కుమార్తె ప్రతిభపై అపార నమ్మకం ఉంది. ఆ అమ్మాయే ఇప్పుడు తన మేథస్సుతో ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రచురించే ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ మ్యాగజైన్‌లో చోటు సంపాదించింది.

ఆమె పేరు బోయ రాధ. ‘మనకు ఎలాంటి ఆస్తులు లేవు.. చదువే నీ ఆస్తి’ అన్న తల్లి మాటలు ఒంట పట్టించుకున్న రాధ.. చదువులో అసమాన ప్రతిభ చూపి.. యువ శాస్త్రవేత్తగా రాణిస్తోంది. ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసిన 35ఏళ్లలోపు వయసుగల  35 మంది శాస్త్రవేత్తలతో జాబితా రూపొందించింది. ఈ జాబితాలో ముగ్గురు భారతీయులు ఉంటే.. అందులో ఒకే ఒక్క తెలుగమ్మాయి బోయ రాధ. ఆమె సక్సెస్‌ అబ్రాడ్‌..

మాది అనంతపురం జిల్లా గుంతకల్‌.. నాన్న బోయ కృష్ణ, టైలర్‌. అమ్మ వెంకట లక్ష్మి, గృహిణి. నేను డిగ్రీవరకు గుంతకల్‌లోనే చదివాను. మొదట్లో నేను, ఇద్దరు అన్నయ్యలు ఇందిరా గాంధీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో చేరాం. కానీ హైస్కూల్‌ స్థాయికి వచ్చేసరికి ముగ్గురికి ఫీజులు కట్టే స్థోమత లేక అన్నయ్యలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. నన్ను మాత్రం అదే స్కూల్‌ కొనసాగించారు. నాకు మొదటి నుంచి మంచి మార్కులే వచ్చేవి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు రావడంతో కాలేజీ వాళ్లు రెండో ఏడాదిలో ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదు.

పైగా ఫస్ట్‌ ఇయర్‌లో చెల్లించిన కాలేజీ ఫీజును బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డు కింద తిరిగి ఇచ్చేశారు. డిగ్రీ.. శ్రీకన్యక పరమేశ్వరి గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఎంపీసీలో చేరాను. అక్కడ కాలేజీలో సిలబస్‌ పూర్తి అయ్యేదికాదు. చాలామంది విద్యార్థులు ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్లేవారు. నాకు శైలజ మేడమ్, శ్రీ రామచంద్రమూర్తి సార్‌ తమ విలువైన సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవారు. డిగ్రీ తర్వాత పీజీ ప్రవేశ పరీక్షలో మ్యాథ్స్, కెమిస్ట్రీ విభాగాల్లో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో సీటు వచ్చింది. నేను కెమిస్ట్రీ సబ్జెక్టు ఎంచుకున్నా.

కీలక మలుపు.. సమ్మర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌
ఎమ్మెస్సీలో చేరిన తర్వాత సివిల్‌  సర్వీసెస్‌కు ప్రిపేరవ్వాలనుకున్నా. కానీ హెచ్‌వోడీ సుభా మేడం సూచనతో కెమిస్ట్రీపై దృష్టిసారించాను. అప్పటివరకు నాకు పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన లేదు. మంచి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి. అడ్మిషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియదు. యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసే విద్యార్థుల సలహా మేరకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ)లో సమ్మర్‌ రీసెర్చ్‌ ఫెలోఫిప్‌ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకున్నా. దానికి ఎంపికవడమే నా జీవితంలో కీలక మలుపు. ఐఐఎస్సీలో సమ్మర్‌ రీసెర్చ్‌ పూర్తయ్యాక పరిశోధనల ప్రాముఖ్యం అర్థమైంది. దాంతో ఇక పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకు రాయాల్సిన పరీక్షల కోసం కోచింగ్‌ తీసుకునే స్థోమత లేక.. జాతీయ స్థాయి పరీక్షలైన సీఎస్‌ఐఆర్‌ నెట్, గేట్‌లకు సొంతంగా ప్రిపేరయ్యా. వీటిల్లో ఉత్తీర్ణత సాధించటంతో సీఎన్‌ఆర్‌ రావు కోఫౌండర్‌గా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎస్‌ఆర్‌) లో సీటు లభించింది. జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో నానో మెటీరియల్‌కు సంబంధించిన అంశంపై పరిశోధనలు చేశాను.



పోస్ట్‌ డాక్టోరల్‌ కోసం అమెరికాకు
జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ థీసిస్‌ సమీక్ష కోసం పంపించిన తర్వాత.. మధ్యలో కొంత సమయం దొరికింది. అప్పుడే ఇండో– యూఎస్‌ విజిటింగ్‌ ప్రీ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ మీద అమెరికా వెళ్లి మూడు నెలల పాటు  నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ చాద్‌ ఎ.మిర్‌కిన్‌ పర్యవేక్షణలో అక్కడి ల్యాబ్‌లో పనిచేశాను. ప్రొఫెసర్‌ చాద్‌ నాటి అమెరికా అధ్యక్షుడికి సైంటిఫిక్‌ ప్యానల్‌లో సలహాదారుడిగా ఉండేవారు. ప్రీ డాక్టోరల్‌ ఫెల్‌షిప్‌ ముగిసిన తర్వాత ఆయన నన్ను అక్కడే పోస్ట్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ చేయాలని సూచించడంతో  ఇండో–యూఎస్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా చేరా. పోస్ట్‌ డాక్టోరల్‌ ప్రోగ్రాంను అమెరికాలోని(షికాగో) నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో        (2012–14) పూర్తిచేశాను. ఆ తర్వాత  యునైటెడ్‌ కింగ్‌డమ్‌ స్పాన్సర్‌ చేసే Leverhulme ఎర్లీ కెరీర్‌ ఫెలోషిప్‌కు ఎంపికవడంతో యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌–స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రానమీలో చేరాను. ప్రస్తుతం ఇక్కడే పరిశోధనలు చేస్తున్నా.

నానో సైన్స్‌.. వైద్య రంగంలోనూ
ఇప్పటివరకు నేను 38 ఇంటర్నేషనల్‌ పబ్లికేషన్స్‌ చేశా. అందులో మూడింటికి పేటెంట్‌ హక్కులు పొందాను. ఇందులో ఒకటి... హైడ్రోజన్‌ అవరోధ పదార్థాన్ని కనుగొన్న పేటెంట్‌. కొన్ని పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి వాడే హైడ్రోజన్‌ వాయువు స్టెయిన్‌లెస్‌స్టీల్‌ లాంటి పదార్థంలో నుంచి కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల భారీ ప్రమాదాలు జరిగి, ప్రాణ నష్టం సంభవించే ఆస్కారముంది. ఈ హైడ్రోజన్‌ లీకేజీలు ఆపడానికి నానో మెటీరియల్‌తో ‘హైడ్రోజన్‌ బారియర్‌ కోటింగ్స్‌’    రూపొందించాను. మరొక పేటెంట్‌.. స్ట్రెయిన్‌ సెన్సార్స్‌కు సంబంధించింది. ఉదాహరణకు చచ్చుబడిపోయిన ఒక రోగి శరీరంలోని సూక్ష్మమైన కదలికల్ని సైతం గుర్తించగలిగేలా నానోసెన్సార్‌ పనిచేస్తుంది. ఇది కదలికలతోపాటు కచ్చితంగా టైమింగ్‌ని, కదలికల తీవ్రత మొదలైన వివరాలను గుర్తిస్తుంది. అంటే.. నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ లేకున్నా ఈ సెన్సార్స్‌ వాటిని గుర్తిస్తాయి. వీటిని పారిశ్రామిక  పరికరాల్లోనూ విరివిరిగా ఉపయోగిస్తారు.  దీనికి కూడా పేటెంట్‌ దక్కింది.

ఎంఐటీ గుర్తించిన వేళ
ఎంఐటీ రివ్యూ 35 అండర్‌ 35 జాబితాలో చోటు సంపాదించడం అంత సులువు కాదు. అద్భుతమైన ప్రతిభ కనబరిస్తే కానీ జాబితాలో చోటు దక్కదు. గతంలో ఈ జాబితాలో చోటు సంపాదించిన వారిలో కొందరు నోబెల్‌ బహుమతులు సైతం పొందారు. ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్, గూగుల్‌ కో ఫౌండర్స్‌ లారీపేజ్, సెర్గీ బ్రిన్, యాపిల్‌ చీఫ్‌ డిజైనర్‌ జోనాథన్‌ ఐవ్, ఐరోబోట్‌ కో ఫౌండర్‌ హెలెన్‌ గ్రెయినర్, పేపాల్‌ కో ఫౌండర్‌ మాక్స్‌లెవ్‌చిన్‌.. మొదలైన ప్రముఖులెందరో ఎంఐటీ రివ్యూ జాబితాలో కనిపించినవారే. ఎంఐటీ రివ్యూ ఎంపిక ప్రక్రియ భిన్నంగా, క్లిష్టంగా ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా పోటీపడతారు. సైన్స్, టెక్నాలజీ, సామాజికసేవ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మొదలైన రంగాల్లో ప్రపంచాన్ని మార్చే సత్తా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. దీనికి ఎంపిక కావాలంటే.. ముందు ఆయా రంగాల్లో నిపుణులైనవారు మన పనిని గుర్తించి ఇందులో ఎంట్రీకి సిఫారసు చేయాలి. తర్వాత మొత్తమ్మీద ఎంఐటీ టెక్నాలజీ రివ్యూమ్యాగజైన్‌ ఎడిటర్‌కు 500 నామినేషన్లు అందుతాయి. ఇందులో ఎడిటర్‌ 100 మందిని ఎంపిక చేసి.. వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన 30 మంది న్యాయ నిర్ణేతలుండే ప్యానల్‌కు పంపిస్తారు. వీరి సిఫారసుల మేరకు 35 మంది యువ శాస్త్రవేత్తల జాబితాను ఎడిటర్‌ ఎంపిక చేస్తారు.

ఉపకారవేతనాలే అండగా
అకడమిక్‌గా ప్రతిభ కనబరుస్తుండటంతో చాలా స్కాలర్‌ఫిప్స్‌ లభించాయి.  లోరియల్‌–యునెస్కో యూకే అండ్‌ ఇండియా ఫెలోషిప్, డేమ్‌ కేథ్లీన్‌ ఒల్లెరెన్‌షా ఫెలోషిప్, యూకే, Leverhulme ఎర్లీ కెరీర్‌ ఫెలోషిప్, యూకే, మేరీ క్యూరీ ఇంటర్నేషనల్‌ ఇన్‌కమింగ్‌ ఫెలోషిప్‌ వంటి స్కాలర్‌షిప్స్‌ ఉన్నత విద్యకు అండగా నిలిచాయి.

ప్రొఫైల్‌
పదో తరగతి           83 శాతం  (1999 – 2000)
ఇంటర్‌ (ఎంపీసీ)    93.2 శాతం  (2000 – 2002)
బీఎస్సీ (ఎంపీసీ)    91 శాతం (2002 – 05)
ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ)    గోల్డ్‌ మెడలిస్ట్, యూనివర్సిటీ ఫస్ట్‌ ర్యాంకు (2005 – 07)
పీహెచ్‌డీ                 7.14/8 సీజీపీఏ (2007 – 2012)

మరిన్ని వార్తలు