అఫ్గాన్‌లో మారణకాండ

20 Oct, 2017 20:05 IST|Sakshi

మసీదుల్లో ఆత్మాహుతి దాడులు.. 47 మంది మృతి

కాందహార్‌: అఫ్గానిస్తాన్‌లో శుక్రవారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. రాజధాని కాబూల్‌తో పాటు, మరో చోట మసీదుల్లో జరిపిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 47 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాలుగురోజుల క్రితం 80 మందిని, గురువారం కాందహార్‌ ప్రావిన్స్‌లో 43 మంది సైనికుల్ని పొట్టనపెట్టుకున్న ఘటనలు మరువక ముందే ఉగ్రవాదులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. కాబూల్‌లోని షియా మసీదులో ప్రజలు సాయంత్రపు ప్రార్థనల కోసం గుమిగూడిన సమయంలో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.

ఈ ఉగ్రదాడిలో 32 మంది మరణించగా, 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్‌ నగర శివార్లలోని దాస్తే బర్చీలో ఈ ఆత్మహుతి దాడి జరిగిందని కాబూల్‌ పోలీసు ప్రతినిధి అబ్దుల్‌ బసీర్‌ తెలిపారు.  ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. ఇక మరో ఘటనలో ఘోర్‌ ప్రావిన్స్‌లోని సున్నీ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య 30 వరకూ ఉండొచ్చని స్థానిక అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.  

ఆర్మీ శిబిరంపై దాడిలో 43 మంది మృతి  
గురువారం కాందహార్‌ ప్రావిన్స్‌లోని మైవాండ్‌ జిల్లా చస్మోలో ఆర్మీ శిబిరంపై ఉగ్ర దాడిలో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్‌ రక్షణ శాఖ ఒక తెలిపింది. శిబిరంలో మొత్తం 60 మంది సైనికులకు గాను ఇద్దరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. 9 మంది గాయపడ్డారు. సైన్యం కాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

మరిన్ని వార్తలు