శుక్రుడిపై శాశ్వత నివాసం!

22 Dec, 2014 03:09 IST|Sakshi
శుక్రుడిపై శాశ్వత నివాసం!
 • భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న నాసా
 • భూమిని పోలిన వాతావరణం, ఇతర సానుకూలతలెన్నో
 • శుక్రుడి వాతావరణంలో తేలే నగరాన్ని నిర్మించే యోచన
 • వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శుక్రుడిపై దృష్టి సారించింది. మన సౌర వ్యవస్థలో భూమికి అతి సమీపంలో ఉండే గ్రహం అదే కావడంతో  భారీ ప్రణాళికలు రూపొందించింది. సౌరశక్తితో నడిచే వ్యోమనౌకలను శుక్రుడిపైకి పంపించి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయాలని, క్రమంగా ఆ గ్రహంపై ఆకాశంలో తేలే మానవ కాలనీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

  నాసాకు చెందిన స్పేస్ మిషన్ అనాలిసిస్ విభాగ పరిశోధకులు డేల్ ఆర్నీ, క్రిస్ జోన్స్ ఈ ప్రతిపాదనలు చేశారు. అంగారక గ్రహంపైకి మనుషులను పంపేలోగానే శుక్రుడిపై పరిశోధనలు చేయడం ఉత్తమమని వారంటున్నారు. శుక్రుడిని లక్ష్యంగా చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ‘హై ఆల్టిట్యూడ్ వీనస్ ఆపరేషనల్ కాన్సెప్ట్(హవోక్) మిషన్‌గా పిలుస్తున్నారు. ఈ పరిశోధనలో ముందుగా శుక్రుడిపైనున్న వాతావరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.

  భూమిపై 50 కి.మీ. ఎత్తున ఉన్నటువంటి వాతావరణమే వీనస్‌పై కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ భూమిపై కంటే కొంచెం తక్కువగా ఉంటాయని, అలాగే శుక్రుడిపై దిగే వ్యోమగాములకు ఎలాంటి రేడియేషన్ ముప్పు కూడా ఉండదని పేర్కొంటున్నారు. ఇక సూర్యుడికి మరింత దగ్గరగా ఉన్నందున శుక్రుడిపై భూమిపై కంటే 40 శాతం అధికంగా సౌర శక్తి లభిస్తుందని చెబుతున్నారు.

  ప్రస్తుతమున్న టెక్నాలజీ ప్రకారం అంగారకుడిపైకి వ్యోమగాములను పంపడానికి 500 రోజులకుపైగా పడుతుందని, అదే శుక్రుడిపైకి 440 రోజుల  ప్రయాణంతోనే చేరుకోవచ్చు. ఈ సానుకూలతల దృష్ట్యా తొలి దశలో శుక్రుడి వాతావరణంపై అధ్యయనం చేసి, తర్వాతి దశలో అక్కడి వాతావరణంలోనే శాశ్వత మానవ కాలనీని నిర్మించాలని నాసా భావిస్తోంది. ముందుగా రోబోతో ప్రయోగం చేసి, తర్వాత ఇద్దరు వ్యోమగాములను అక్కడ నెల రోజుల పాటు ఉంచాలని చూస్తోంది. చివరిగా శాశ్వతంగా మనుషులు ఉండగలిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం సౌరశక్తితో నడిచే రెండు వ్యోమనౌకలను కూడా డిజైన్ చేస్తోంది.
   

మరిన్ని వార్తలు