పాకిస్తాన్‌లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ..!!

29 Jan, 2019 15:49 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : సుమన్‌ కుమారి అనే మహిళ పాకిస్తాన్‌లోని ఓ కోర్టుకు సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా దాయాది దేశంలో  జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఖంబర్‌-షాదాద్‌కోట్‌ జిల్లాకు చెందిన కుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులవడం విశేషం. అక్కడి హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన కుమారి కరాచీలోని సాజ్‌బిస్ట్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు.

పేదలకు ఉచిత న్యాయ సేవలందిచడమంటే కుమారికి  ఎంతో ఇష్టమని ఆమె తండ్రి పవన్‌కుమార్‌ బొదాని వెల్లడించారు. తన కూతురు చాలెంజింగ్‌ ప్రొఫెషన్‌ను ఎంచుకుందని అన్నారు. పవన్‌కుమార్‌ డాక్టర్‌ కాగా, ఆయన మిగతా ఇద్దరు కూతుళ్లలో ఒకరు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, మరొకరు చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పాకిస్తాన్‌లో జడ్జిగా పనిచేసిన తొలి హిందువుగా జస్టిస్‌ రానా భగవాన్‌దాస్‌ నిలిచారు. 2005 నుంచి 2007 వరకు సుప్రీం కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలందించారు. కాగా, సివిల్‌ జడ్జి/జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ నియమాలకు జరిగిన పరీక్షలో కుమారి 54 స్థానంలో నిలిచారు.

మరిన్ని వార్తలు