సూర్యుడు ‘చిన్న’బోయాడు!

19 Mar, 2016 01:25 IST|Sakshi
సూర్యుడు ‘చిన్న’బోయాడు!

లండన్: సూర్యుడితో పోల్చి చూస్తే భూమి పరిమాణం గోలీ అంత.. అవునా? మరి మన సూర్యుడు కూడా గోలీ పరిమాణమంత కనిపిస్తే. ఇదేంటనుకుంటున్నారా..? సూర్యుడి కన్నా వంద రెట్లకు పైగా పెద్దవిగా ఉన్న 9 నక్షత్రాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా స్పేస్ టెలిస్కోప్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ సాయంతో సూర్యుడికి 1,70,000 కాంతి సంవత్సరాల దూరంలో ఓ భారీ నక్షత్రాల సముదాయం ఉన్నట్లు కనుగొన్నారు. ఆ సముదాయాన్ని ఆర్136గా  గుర్తించారు.

ఆ తొమ్మిది నక్షత్రాలు భారీగా ఉన్నాయని, వేడిని ప్రసరిస్తూ ప్రకాశిస్తున్నాయని తెలిపారు. సూర్యుడి కన్నా 50 రెట్లు పెద్ద నక్షత్రాలు డజన్లకొద్దీ ఉన్నాయని, అయితే 9 మాత్రం సూర్యుడికి 100 రెట్లకన్నా పెద్దవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విశ్వంలో అతిపెద్ద నక్షత్రంగా ఆర్136ఏ1 ఉందని, అది సూర్యుడికి 250 రెట్లు పెద్దదిగా ఉంటుందని చెప్పారు. ఒక నెలకు మన భూమి పరిమాణమంత మెటీరియల్‌ను అవి కోల్పోతాయని, భారీగా బరువు తగ్గిపోతుండటం మూలంగా వాటి జీవితకాలం తక్కువని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్‌కు చెందిన పరిశోధకుడు పౌల్ క్రౌతెర్ తెలిపారు.

మరిన్ని వార్తలు