ముందెన్నడూ చూడని సూర్యుడి అద్భుత ఫొటోలు!

30 Jan, 2020 11:43 IST|Sakshi

వాషింగ్టన్‌: సూర్యుడికి సంబంధించిన అత్యంత అరుదైన ఫొటోలను అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సోలార్‌ టెలిస్కోప్‌గా ప్రసిద్ధి పొందిన డేనియల్‌ కే ఇనౌయే సోలార్‌ టెలిస్కోప్‌(డీకేఐఎస్‌టీ) అద్భుత ఆవిష్కారానికి కారణమైంది. దీని ద్వారా సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అరుదైన ఫొటోలను చూసే అవకాశం మానవాళికి దక్కింది. కాగా హవాయి ద్వీపంలో ఏర్పాటు చేసిన ఈ భారీ టెలిస్కోపు ద్వారా సూర్యుడిని అత్యంత సమీపంగా చూస్తూ.. అంతర్గత శక్తిని అంచనా వేసే అవకాశం ఉంటుందని ఆస్ట్రోనాట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇది విడుదల చేసిన ఫొటోల ఆధారంగా.. సూర్యడి ఉపరితలం మీది కణాల వంటి ఆకారాలను జూమ్‌ చేయగా.. ఒక్కోటి అమెరికా రాష్ట్రం టెక్సాస్‌ పరిమాణంలో ఉందని తెలిపారు.

 

ఇక వీటిని విశ్లేషించడం ద్వారా సూర్యుడి నుంచి వెదజల్లబడుతున్న శక్తిమంతమైన కాంతి కిరణాలు, జ్వాలల ఉత్పన్నానికి కారణాల్ని కనుగొనవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా సదరు జ్వాలల కారణంగా ఉపగ్రహాలు, పవర్‌గ్రిడ్లు ధ్వంసం కాకుండా సత్వరమే హెచ్చరికలు జారీ చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. కాగా సూర్యుడి ఉపరితలంపై గల పలు రహస్యాలను తెలుసుకునేందుకు డీకేఐఎస్‌టీ రూపకల్పన జరిగింది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు లక్షలాది రెట్లు వేడిగా ఉంటుంది, అంతరిక్షంలో వేడి గాల్పులకు కారణమవుతున్న అంశాల గురించి అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.   

>
మరిన్ని వార్తలు