సన్‌బాత్‌తో గుండెపోటు, బీపీ కూడా రాదు

3 May, 2016 17:51 IST|Sakshi
సన్‌బాత్‌తో గుండెపోటు, బీపీ కూడా రాదు

సూర్యుడి లేలేత కిరణాలకు సేదతీరితే శరీరంలో 'డి' విటమిన్ పెరిగి శరీరానికి కొత్త శక్తి వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. సన్‌బాత్ వల్ల ఒక్క డి విటమిన్ రావడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, లావు తగ్గి సన్నబడతారని, ముఖ్యంగా లేత ఎండ వేడికి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుందని, తద్వారా గుండెపోటు సమస్యలు కూడా రావని కనుగొన్నారు. అలాగే సన్‌బాత్ వల్ల మెదడులో సెరొటోనిన్ అనే రసాయనం విడుదల కావడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, ఆస్తమా, కండరాల బలహీనతకు దారితీసే స్క్లేరోసిస్ లాంటి జబ్బులు రావని కూడా తేల్చారు.

స్టాక్‌హోమ్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ సరికొత్త అంశాలు వెలుగుచూశాయి. గత 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా సన్‌బాత్ చేస్తున్న స్వీడన్‌కు చెందిన మూడువేల మంది మహిళలపై అధ్యయనం చేయడం ద్వారా ఈ కొత్త ప్రయోజనాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. డి విటమిన్‌కు, ఈ కొత్త ప్రయోజనాలకు ఎలాంటి సంబంధం లేదని కూడా వారు తెలిపారు.

పొగతాగడం ఎంత ముప్పో, సన్‌బాత్ చేయకపోవడం అంత ముప్పని, పొగతాగే వారు ఎక్కువ కాలం బతకనట్లే సన్‌బాత్ చేయనివారు కూడా ఎక్కువ కాలం బతకరని వారన్నారు. సన్‌బాత్ వల్ల ఆయురారోగ్యాలతో ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. సన్ బాత్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా.. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మాత్రం ఉంటుందని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు