పిచాయ్‌ దిగ్భ్రాంతి.. సత్య నాదెళ్ల విచారం!

4 Apr, 2018 10:01 IST|Sakshi

సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ వీడియో షేరింగ్‌ కంపెనీ యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ మంగళవారం ఉదయం కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం ఆమె తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచింది. కాలిఫోర్నియాలోని సాన్‌ బ్రునోలో ఉన్న యూట్యూబ్‌ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారి కాల్పులు చోటుచేసుకోవడంతో బెంబేలెత్తిపోయిన యూట్యూబ్‌ ఉద్యోగాలు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పరిగెత్తారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయోత్పాతాన్ని నింపింది.

ఈ కాల్పుల ఘటనపై గుగూల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్విటర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని పేర్కొన్నారు. ‘ఈ రోజు జరిగిన విషాదాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. ఈ కష్టసమయంలో, మా ఉద్యోగులు, యూట్యూబ్‌ కమ్యూనిటీకి అండగా ఉండేందుకు నేను, సుసాన్‌ వొజ్సిస్కి (యూట్యూబ్‌ సీఈవో) ప్రయత్నిస్తున్నాం. వెంటనే స్పందించిన పోలీసులకు, మాకు అండగా సందేశాలు పంపిన వారికి కృతజ్ఞతలు’ అని పిచాయ్‌ పేర్కొన్నారు. అటు యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ కాల్పుల ఘటనలోని బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. గూగుల్‌ ఉద్యోగులకు, సంస్థకు తమ మద్దతు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, ట్విట్టర్‌ సీఈవో, కో ఫౌండర్‌ జాక్‌ డోర్సె తదితరులు గూగుల్‌, యూట్యూబ్‌ ఉద్యోగులకు అండగా ట్వీట్‌ చేశారు. ఈ కష్టసమయంలో తాము వారికి అండగా ఉన్నామని, వారు త్వరగా ఈ షాక్‌ నుంచి కోలుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు