చిక్కిపోతున్న చందమామ

15 May, 2019 04:43 IST|Sakshi

అంతర్భాగం చల్లగా మారడంతో..

వాషింగ్టన్‌: చంద్రుడి లోపలి భాగం చల్లబడటంతో చంద్రుడు కుంచించుకు పోతున్నాడట. గత కోట్ల సంవత్సరాల కాలంలో దాదాపు 50 మీటర్ల మేర చంద్రుడు బక్కచిక్కిపోయాడని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో ఉపరితలంపై ప్రకంపనలు వస్తున్నాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ద్రాక్షపండు ఎండితే వచ్చే ముడుతల మాదిరిగా చంద్రుడి ఉపరితలంపై ముడుతలొస్తున్నట్లు తేలింది. అయితే చంద్రుడి ఉపరితలం పెళుసుగా ఉండటంతో కుంచించుకుపోతున్న కొద్దీ పగుళ్లు ఏర్పడుతున్నట్లు వివరించారు.

ఈ పగుళ్ల ద్వారా చిన్నపాటి లోయలు ఏర్పడుతున్నాయి. వీటి వల్లే ప్రకంపనలు వస్తున్నట్లు తమ ప్రాథమిక అధ్యయనంలో తేలిందని అమెరికాలోని స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ ఎయిర్‌ స్పేస్‌ మ్యూజియానికి చెందిన శాస్త్రవేత్త థామస్‌ వాటర్స్‌ వెల్లడించారు. ఈ లోయలకు దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసంలోనే ఎక్కువగా ప్రకంపనలు వస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. అపోలో వ్యోమగాములు 1969 నుంచి 1977 వరకు చంద్రుడి ఉపరితలంపై అమర్చిన నాలుగు సిస్మోమీటర్ల నుంచి వచ్చిన డేటా ఆధారంగా పలు సాంకేతికతలను వినియోగించి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు