పౌరులకు సర్కారీ బోనస్‌...!

19 Feb, 2018 20:41 IST|Sakshi

సింగపూరులో మిగులు బడ్జెట్‌...

వివిధ రూపాల్లో ముక్కుపిండి పన్నులు వసూలు చేసే దేశాలే కాదు తమ పౌరులకు బోనస్‌  చెల్లించే దేశం కూడా ఉంది. ఈ విషయంలో సింగపూర్‌ది   విలక్షణ శైలి.  దేశ పౌరసత్వంతో పాటు  21 ఏళ్ల వయసు ఉంటే చాలు అక్కడ బోనస్‌ పొందేందుకు అర్హులు. అదీకూడా సంపాదించే ఆదాయాన్ని బట్టి తక్కువ ఆదాయాలు వచ్చే వారికి ఎక్కువ, పెద్దమొత్తంలో ఆర్జించే వారికి తక్కువగా  ఈ మొత్తాన్ని ఇవ్వబోతోంది. 2017లో  దాదాపు పది బిలియన్ల సింగపూర్‌ డాలర్ల మిగులు బడ్జెట్‌(అమెరికన్‌ డాలర్లలో 7.6 బిలియన్లు) సాధించడంతో ఈ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటోంది.

ఎందుకు?
ప్రత్యేక సందర్భాల్లో డబ్బురూపంలో ఇచ్చే ఈ బహుమతిని స్థానికభాషలో ‘ హాంగ్‌బావో’ అని  అంటారు. సింగపూర్‌ అభివద్ధి ఫలాలు పౌరులకు అందాలనే తమ ప్రభుత్వ దీర్ఘకాల నిబద్ధతకు అనుగుణంగా ఈ బోనస్‌ చెల్లిస్తున్నట్లు ఆ దేశ ఆర్థికమంత్రి హెంగ్‌స్వీకీట్‌ ప్రకటించారు.  చట్టబద్ధ అధికారాలున్న బోర్డుల నుంచి అదనపు ఆదాయంతో పాటు, స్టాంప్‌ డ్యూటీ రూపంలో ఖజానాకు  అంచనా కంటే  అధిక ఆదాయం వచ్చింది.   ఈ  కారణంగా ‘ఎస్‌జీ బోనస్‌’ పేరిట  ప్రజలకిస్తున్న బహుమతుల వల్ల అక్కడి ప్రభుత్వంపై 700 సింగపూర్‌ డాలర్ల (అమెరికన్‌ డాలర్లలో 533 మిలియన్లు) వ్యయం అవుతుంది.

ఎంత మందికి లాభం...
ఈ బోనస్‌  పొందేందుకు మొత్తం 27 లక్షల మంది అర్హులు. ఏడాదికి లక్షకు పైగా సింగపూర్‌ డాలర్లు సంపాదించే వారికి 100 డాలర్లు, 28 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల దాకా ఆర్జించే వారికి 200 డాలర్లు, 28 వేల డాలర్లు అంత కంటే తక్కువ ఆదాయం వచ్చే వారికి 300 సింగపూర్‌ డాలర్ల వరకు అందజేస్తారు. 2018 చివరికల్లా ఈ బోనస్‌లు చెల్లిస్తారు.

పరిశ్రమలకు వాత...
మిగులు  మొత్తంలో దాదాపు సగం (5 సింగపూర్‌ బిలియన్‌ డాలర్లు) రైల్వే మౌలికసదుపాయాల నిధి కింద విడిగా ఉంచుతున్నారు. ఈ నిధితో సింగపూర్‌లో కొత్త రైల్వే లైన్లు వేస్తారు. మిగిలిన మొత్తంలో రెండు సింగపూర్‌ మిలియన్‌ డాలర్ల మేర వయోజనులు, హెచ్చుస్థాయిలో వికలత్వం ఉన్న వారి బీమా పథక ప్రీమియం కోసం ఖర్చుచేస్తారు. అయితే ప్రస్తుతం ప్రజలికిస్తున్న  బోనస్‌తో పాటు వస్తుసేవాపన్ను (జీఎస్‌టీ)ను 7 శాతం నుంచి 9 శాతం వరకు (2021–25 మధ్య కాలంలో అమలు) పెంచనున్నట్లు మంత్రి హెంగ్‌స్వీకీట్‌  చేసిన ప్రకటన అక్కడి వారికి కొంచెం చేదు వార్తే.  వాతావరణ మార్పు, సముద్రమట్టం పెరగడం వల్ల సింగపూర్‌కు జరిగే నష్టనివారణలో భాగంగా  25 వేల టన్నులకు పైబడి కర్బన ఉద్గారాలు వదిలే పరిశ్రమలపై టన్నుకు 5 సింగపూర్‌ డాలర్ల ‘కార్బన్‌ టాక్స్‌’ను (2019–23 మధ్య కాలంలో) సైతం విధిస్తారు.

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు