జీవిత చరమాంకంలో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..

17 Sep, 2017 01:52 IST|Sakshi
జీవిత చరమాంకంలో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..

వారసత్వంగా వచ్చిన గుర్రాల పెంపకం అంటే యూకేలోని బ్రాంటన్‌కు చెందిన పాట్రిక్‌ సాండర్స్‌(87)కి ఎంతో మక్కువ. తన జీవన విధానంలోనే గుర్రాలు కూడా ఓ భాగంగా మారాయి. ఎన్నో ఏళ్లుగా గుర్రాల స్వారీని ఎంతో మందికి నేర్పించాడు. అయితే జీవిత చరమాంకంలో ‘నార్త్‌ దేవాన్‌ హాస్పయిస్‌ కేర్‌’ (మరణానికి అంచున ఉన్న రోగులను అక్కున చేర్చుకుని సేవలందించే సంస్థ)లో చేరాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ నర్సులతో ఎప్పుడూ గుర్రాల గురించే మాట్లాడేవాడు. దీంతో అక్కడి సిబ్బంది పాట్రిక్‌కి అతని చివరి రోజుల్లో మరచిపోలేని సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నారు.

ఓ గుర్రపు శాల నుంచి విక్టర్‌ అనే గుర్రాన్ని పాట్రిక్‌ వద్దకు తెచ్చారు. గుర్రాన్ని తీసుకువచ్చిన రోజు పాట్రిక్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, బెడ్‌పై నుంచి కూడా అడుగు కింద పెట్టలేక పోయాడు. దీంతో అక్కడి స్టాఫ్‌ ఎలాగైనా పాట్రిక్‌కి చివరి రోజుల్లో అతని కోరిక నెరవేర్చాలని ఏకంగా బెడ్‌నే బయటకు తీసుకు వచ్చారు. ‘రోగుల జీవితాన్ని అయితే పెంచలేము.. కానీ జీవితంలో మిగిలిన రోజులను ఆనందంతో నింపడానికి మా వంతు ప్రయత్నిస్తాము’ అని కేర్‌లో పనిచేస్తున్న నర్స్‌ కాథీ వతిహామ్‌ చెప్పారు. పాట్రిక్‌ బెడ్‌పైనుంచే గుర్రాన్ని చూసి పట్టలేని సంతోషంతో తన చేతులతోనే వాటికి ఆహారాన్ని తినిపించాడు. ఇది జరిగిన మూడు రోజులకే పాట్రిక్‌ మృతి చెందాడు. ‘నాన్న చివరి రోజుల్లో  గుర్రానికి ఆహారం పెట్టడం నేను ఎన్నటికీ మరిచిపోను’ అంటూ పాట్రిక్‌ కూతురు జేన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు