కిమ్‌ జాంగ్‌కు సర్‌ప్రైజ్‌.. ఉత్కంఠ!

26 May, 2018 17:56 IST|Sakshi
దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ కరచాలనం

సియోల్‌: ఆది నిష్టూరమే మేలనిపించేలా.. శత్రువులుగా ఉన్నప్పటి కంటే, స్నేహితులుగా మారుదామనుకున్న తర్వాత కిమ్‌-ట్రంప్‌ల వైఖరి మరింత విసుగు కలిగించే రీతిలో క్షణక్షణానికి మారుతోంది. జూన్‌ 12న సింగపూర్‌లో జరగాల్సిన అమెరికా-ఉత్తరకొరియా దేశాధినేతల భేటీ యవ్వారం గంటకో మలుపు తిరుగుతోంది. ఒకసారి కిమ్‌ ‘అసలు చర్చలే లేవు’ అంటే.. ఇంకోసారి ట్రంప్‌ ‘ఠాట్ ఆయనతో నేను మాట్లాడబోను‌..’ అని ప్రకటిస్తారు. ఉద్రిక్తతను నివారించి, చర్చలు సజావుగా సాగేందుకు భారత్‌ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చర్చల తేదీ(జూన్‌ 12) దగ్గర పడుతుండటంతో ఇక దక్షిణకొరియానే నేరుగా రంగంలోకి దిగింది. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ శనివారం అకస్మాత్తుగా ఉత్తరకొరియాకు వెళ్లి కిమ్‌ జాంగ్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సరిహద్దులోని పన్ముంజోమ్‌ గ్రామంలో ఇరు నేతలూ సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ మేరకు దక్షిణకొరియా అధ్యక్షుడి అధికారిక భవనం బ్లూ హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

చర్చలకు కిమ్‌ ఒప్పుకున్నట్టేనా?: ఉత్తరకొరియాతో అమెరికా చర్చలకు సంబంధించి రోజురోజుకూ మారుతోన్న పరిణామాలపై కిమ్‌-మూన్‌లు చర్చించారని, భేషజాలకు పోకుండా చర్చలకు సిద్ధంకావాలని కిమ్‌కు మూన్‌ సూచించారని బ్లూహౌస్‌ పేర్కొంది. అయితే, ట్రంప్‌తో చర్చలకు కిమ్‌ ఒప్పుకున్నది లేనిది.. మూన్‌ రేపు(ఆదివారం) ఉదయం అధికారికంగా ప్రకటిస్తారని, అప్పటిదాకా ఉత్కంఠ తప్పదని దక్షిణకొరియా అధికారగణం పేర్కొంది. అమెరికాతో చర్చల అంశంతోపాటు రెండు కొరియా దేశాల మధ్య కొనసాగుతోన్న మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని కూడా కిమ్‌-మూన్‌లు భావిస్తున్నారని, ఆమేరకు అవసరమైన చర్యలను వేగవంతం చేశారని బ్లూహౌస్‌ తెలిపింది.
(చూడండి: కిమ్‌కు ట్రంప్‌ కళ్లెం వేశారా?)
(చదవండి: మరోసారి మాట మార్చిన ట్రంప్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు