ఫుట్‌బాల్‌తో మెదడులో మార్పులు 

20 Nov, 2018 00:00 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆటలు శారీరక ఆరోగ్యంతోపాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని మనందరికీ తెలిసిందే. మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి కచ్చితంగా ఆటలు ఆడాలని నిపుణులు కూడా సూచిస్తుంటారు. తాజాగా ఇదే విషయాన్ని పరిశోధకులు అధ్యయనం ద్వారా వివరించారు. ఒక లీగ్‌ ఫుట్‌బాల్‌ ఆట టీనేజీ యువకుల మెదడులో స్పష్టమైన మార్పులకు కారణమవుతుందని చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకి చెందిన శాస్త్రవేత్తలు మాగ్నటిక్‌ రిజోనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎమ్‌ఆర్‌ఐ) విధానం ద్వారా 15 నుంచి 17 ఏళ్లున్న విద్యార్థుల మెదడులను నిశితంగా గమనించారు. ఫుట్‌బాల్‌ ఆడక ముందు ఆడిన తర్వాత వారి మెదడులో స్పష్టమైన మార్పును గమనించారు. మెదడు ముందు భాగంలోని ఆకృతిలో పరిశోధకులు మార్పును గమనించారు. ఆటలు చిన్నారుల మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోడానికి ఈ అధ్యయాన్ని చేపట్టారు. మెదడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని చిన్నారుల్లో ఆటల ద్వారా సానుకూల ప్రభావాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు