ఓఐసీ సమావేశానికి పాకిస్తాన్‌ గైర్హాజరు

1 Mar, 2019 15:44 IST|Sakshi

అబుదాబి: భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ రాకతో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్‌ డుమ్మా కొట్టింది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో పాక్‌ విదేశాంగ మంత్రి మొహ్మద్‌ ఖురేషీ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. సమావేశంలో సుష్మా పుల్వామా ఉగ్రదాడిని లేవనెత్తారు. పాకిస్తాన్‌ బెదిరింపులకు భయపడేది లేదని.. ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల పాటు దుబాయ్‌లో జరునున్న ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

పుల్వామా దాడితో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ దోషిగా తేలిందని సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెట్రేగిపోతోందని, దాన్ని నిలువరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు శాంతికి దారి చూపే మార్గంగా భారత్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం కారణంగా ఎన్నో దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే పోరాటానికి భారత్‌ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు. (సుష్మా వస్తే మేం రాం : పాక్‌)

పాకిస్తాన్‌ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆ దేశంపై సుష్మా మండిపడ్డారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘ఉగ్రవాదులు చేస్తున్న దారుణాల వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు.. వెంటనే దాన్ని నిలిపివేయాలి. అన్ని దేశాలు కలిసి కట్టుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. మతానికి వ్యతిరేంగా ఏ పోరాటం ఉండదు, మన పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే ఉండాలి. మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. భారత్‌ ఎల్లప్పుడూ బహుళత్వాన్ని అనుసరిస్తుంది. మానవత్వాన్ని కాపాడాలనుకుంటే.. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం నిలిపివేయాలి’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు