భారత్‌ను సులభంగా ఓడించేస్తాం

22 Jul, 2017 01:46 IST|Sakshi
భారత్‌ను సులభంగా ఓడించేస్తాం

చైనా మీడియా ప్రేలాపన
పార్లమెంటులో సుష్మా స్వరాజ్‌ అబద్ధాలు చెప్పారని విమర్శ

బీజింగ్‌:
సిక్కిం సరిహద్దు వివాదంపై చైనా అధికార మీడియా మాటలు శ్రుతిమించిపోతున్నాయి. ‘భారత్‌..చైనా సహనాన్ని పరీక్షించింది. ఆ దేశం డోక్లాం నుంచి తన బలగాలను ఉపసంహరించుకోకపోతే చైనా చేయాల్సింది ఇక యుద్ధమే. యుద్ధమే వస్తే భారత్‌ సులభంగా ఓడిపోతుంది.. తన ప్రాంతాలనూ కోల్పోతుంది.. భారత ఆర్మీని చైనా ఆర్మీతో పోల్చడం హాస్యాస్పదం.. చైనా సైన్యంతో పోలిస్తే భారత సైన్యం ఎంతో వెనకబడి ఉంది. చైనా సైనిక వ్యయం భారత్‌ సైనిక వ్యయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ’ అని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పత్రిక శుక్రవారం పేర్కొంది.

సరిహద్దులోని టిబెట్‌లో ఇటీవల చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) బలగాలు చేసిన కాల్పులు, ఇతర సైనిక విన్యాసాలు,  ఆ ప్రాంతానికి తరలించిన సైనిక సామగ్రి కేవలం ప్రదర్శన కోసం చేసినవి కావని హెచ్చరించింది. ఆ బలగాలు తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు వెనక్కి రావని, చైనా ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోదని, ఇది చైనా ప్రజల పవిత్ర ఆశయమని చెప్పుకొచ్చింది. పీఎల్‌ఏ వాస్తవాధీన రేఖను దాటి అవతలికి వెళ్లే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

భారత్‌కు ఏ దేశమూ మద్దతివ్వదు..
తాము చైనా భూభాగాన్ని ఆక్రమించుకోలేదని, సిక్కిం వివాదంపై అన్ని దేశాలు తమకు మద్దతిస్తున్నాయంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని గ్లోబల్‌ టైమ్స్‌ విమర్శించింది. ‘భారత్‌ చైనా భూభాగంలోకి చొరబడిన మాట వాస్తవం. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయింది. ఏ దేశమూ భారత దురాక్రమణకు మద్దతివ్వదు’ అని పేర్కొంది. చర్చల కోసం ఇరుపక్షాలు వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి పిలవాలని భారత్‌ చెబుతుండటం ఆ దేశం అపరాధ భావనతో ఉందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. చర్చల కోసం ముందస్తు షరతుగా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించే ప్రసక్తే లేదని పేర్కొంది. భారత్‌పై చైనా సైనిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుందని, భారత్‌ చివరకు అవమాన భారంతో మిగిలిపోతుందని ప్రేలాపనలు చేసింది.  

ఆర్‌సీఈపీ ఒప్పందానికి విఘాతం కలగొద్దు: చైనా
సిక్కిం సరిహద్దు వివాదం వల్ల ఆసియా–పసిఫిక్‌ దేశాలు కుదుర్చుకోవడానికి యత్నిస్తున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్‌సీఈపీ) ఒప్పందానికి విఘాతం కలగకూడదని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో వాణిజ్య, పెట్టుబడుల సరళీకరణకు ఉద్దేశించిన ఈ ఒప్పందం కోసం 16 దేశాలు ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో చర్చలు జరుపుతున్నాయి.

గమనిస్తున్నాం: అమెరికా
వాషింగ్టన్‌: భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. రెండు దేశాలు ప్రత్యక్ష చర్చలతో ఉద్రిక్తత తగ్గించుకోవాలని విదేశాంగ ప్రతినిధి హీదర్‌ నాయెర్ట్‌ సూచించారు. ‘ప్రత్యక్ష చర్చలను ప్రోత్సహిస్తాం. భారత్, చైనాల పరస్పర చర్చలు జరపనున్నాయి’ అని వెల్లడించారు. బ్రిక్స్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్‌ఎస్‌ఏ) సమావేశం కోసం భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ ఈ నెలాఖర్లో చైనాకు వెళ్తున్న నేపథ్యంలో నాయెర్ట్‌ చర్చల అంశాన్ని ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు