‘మోదీ.. మీరొక చెత్త విలన్‌లా మిగిలిపోతారు’

21 Feb, 2019 15:11 IST|Sakshi

న్యూఢిల్లీ : పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపాలని స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రీటా తుంగ్‌బెర్గ్‌(16) ఆకాంక్షించింది. లేనిపక్షంలో ఆయన మానవ చరిత్రలో ఓ చెత్త విలన్‌లా మిగిలిపోతారని అభిప్రాయపడింది. ఈ మేరకు గ్రీటా మోదీకి విఙ్ఞప్తి చేస్తున్న వీడియోను బ్రుట్‌ ఇండియా అనే వీడియో పబ్లిషర్‌ ప్రసారం చేసింది. ‘డియర్‌ మిస్టర్‌ మోదీ.. పర్యావరణ సంక్షోభాన్ని అరికట్టేందుకు మీరు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం మాటలు మాట్లాడితే సరిపోదు. అలాగే చిన్న చిన్న విజయాలకు సంతోషించడం మొదలుపెడితే.. మీరు వైఫల్యం చెందుతారు. ఒకవేళ అదే జరిగితే మానవాళి చరిత్రలో మీరో చెత్త విలన్‌లా మిగిలిపోతారు. కానీ అలా జరగడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు’ అంటూ గ్రీటా తన మెసేజ్‌లో పేర్కొంది.

కాగా అస్‌పెర్జర్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రీటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్‌24 సదస్సులో ప్రసంగించింది. ఈ సందర్భంగా.. రాజకీయ నాయకులను ఉద్దేశించి.. ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించింది.

కాగా కర్భన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 121 దేశాల సహకారంతో 2030 నాటికి సోలార్‌ పవర్‌ ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాటైన ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ గురించి అంతర్జాతీయ వేదికపై మోదీ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గ్రిటా.. ఆయనకు మెసేజ్‌ పంపింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా