ఇళ్లు తగులబడకుండా ‘గులాబీ పౌడర్‌’

13 Nov, 2019 16:02 IST|Sakshi

ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్‌ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తోంది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు బుధవారం కూడా కొనసాగుతోంది. అటవి శివారు ప్రాంతాల్లోని నివాస గృహాలు అంటుకోకుండా అడ్డుకోగల అమ్మోనియంతో తయారు చేసిన ఓ రకమైన గులాబీ ఎరువుల పొడిని హెలికాప్టర్ల ద్వారా ఇంటి కప్పులపైనా, పక్కనున్న పొదలపైన, కార్లపైన చల్లుతున్నారు. 

ఈ పౌడర్‌లో అమ్మోనియంతోపాటు డైఅమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్‌ ఉంటుంది. ఇది మంటలు వ్యాపించకుండా ఉంటుందని, అయితే ఘాటైన వాసన కలిగిన ఈ పౌడర్‌ వల్ల శ్వాస ఇబ్బందులు, చర్మంపై దద్దులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పౌడరుకు దూరంగా ఉండే వాళ్లకన్నా పౌడరు చల్లే వారు, వాటిని మోసుకొచ్చే వారికే ఈ ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తులై తగిన సూచనలు చేశారు. 

కార్లపైన, వాహనాలపైన పడిన గులాబీ పౌడరును నీటితో డైల్యూట్‌ చేసి, డిటర్జెంట్, బ్రష్‌లు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని, ఆ సందర్భంగా చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని, కాళ్లకు జారిపోని బూట్లను ధరించాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి 220 డాలర్ల జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు. మంటల నుంచి నివాస ప్రాంతాలను రక్షించడం కోసం మంగళవారం అమ్మోనియంతో కూడి గులాబీ పౌడర్‌ను చల్లామని, ఇదే విష పదార్థం కాదని రూరల్‌ ఫైర్‌ సర్వీస్‌ అధికార ప్రతినిధి ఇన్‌స్పెక్టర్‌ బెన్‌ షెపర్డ్‌ మీడియాకు తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చని అన్నారు. ఈ పౌడరు బారిన పడిన వారు నీళ్లతో ఒళ్లంతా శుభ్రం చేసుకోవాలని, అవసరమైతే వైద్యులను సంప్రతించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, దీని వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా పర్యావరణ కార్యకర్త ఎరిన్‌ బ్రొకోవిచ్‌ హెచ్చరిస్తున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు