సిరియా మారణహోమం ఖరీదు.. 3 లక్షల ప్రాణాలు

25 Nov, 2017 18:20 IST|Sakshi

బీరుట్‌ : సిరియా అంతర్గత యుద్ధంలో మొత్తంగా 3 లక్షల 40 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ సంస్థ ఒకటి ప్రకటించింది. సిరియా మారణహోమానికి ముగింపు పలికే ఉద్దేశంతో జెనీవాలో ప్రపంచ దేశాలు చర్చిస్తున్న సమయంలో ఇటువంటి ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ చర్చలు ముగిసేలోపు మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని సదరు సంస్థ పేర్కొంది.


సిరియాలో 2011 నుంచి మొదలైన అంతర్గత సంక్షోభం, ఐసిస్‌ తీవ్రవాద ప్రభావాలను గమనిస్తున్న బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల సంఘం ఈ ప్రకటన చేసింది. సిరియాలో 2011 నుంచి ఇప్పటివరకూ 3 లక్షల 43 వేల 511 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మృతుల్లో లక్షకు పైగా సాధారణ పౌరులు ఉన్నారని.. అందులోనూ 19 వేల మంది చిన్నారులు, 12 వేల మంది మహిళలు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది.


అంతర్గత సంక్షోభం మొదలైన తరువాత ఇప్పటివరకూ ప్రభుత్వ అనుకూల దళాలు.. లక్ష 19 వేల మందిని ఊచకోతకోశాయి. ఇందులో 62 వేల మంది సిరియన్‌ సైనికులు ఉండగా, 10 వేల మంది మిలటరీ అనుకూలరు ఉన్నట్లు అంచనా.
 
 

మరిన్ని వార్తలు