విమానాశ్రయంలో ఆ ఒక్కడు!

27 Jun, 2018 01:29 IST|Sakshi

ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న సామెత వినే ఉంటారు.. కానీ దానికి అర్థం హసన్‌ అల్‌ కొంటార్‌ అనే వ్యక్తికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో!   ఆయన వంద రోజులుగా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లోనే ఉంటున్నాడు.. స్వదేశంలోనేమో యుద్ధం.. ఇంకో దేశానికి వెళ్లలేని పరిస్థితి.. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో.. ఇప్పుడు నాసా వెంటపడ్డాడు.. ‘బాబ్బాబు.. కొన్నేళ్లలో అంగారకుడిపైకి మనుషుల్ని పంపుతున్నారట కదా.. ఆ గుంపులో నన్నూ చేర్చుకొ’మ్మని! మరి ఎవరీ హసన్‌.. ఎందుకలా విమానాశ్రయంలో ఉన్నాడు.. ఏమిటీ పరిస్థితి తెలుసుకుందామా..?

నిన్న మొన్నటి వరకూ హసన్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో బీమా ఏజెంటుగా పనిచేసేవాడు. పుట్టింది సిరియాలో. వయసు 38 ఏళ్లు. ఏ దుర్ముహూర్తాన బయలుదేరాడోగానీ ఈ ఏడాది మార్చి 7వ తేదీన మలేసియాలోని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. యుద్ధంలో చేరేందుకు నిరాకరించాడంటూ సిరియా ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టును రద్దు చేసింది. దాంతో 200కుపైగా దేశాలున్న ఈ ప్రపంచంలో ఏ దేశానికీ చెందని వాడైపోయాడు.

విమానాశ్రయంలోని టెర్మినల్‌–2యే ఆయన ఇల్లయిపోయింది. ఓ దిండు, నీళ్ల బాటిల్, నడుం వాల్చేందుకు ఓ బెంచి.. అంతే! ‘ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకొన్ని రోజులు ఇక్కడే గడపాల్సి ఉంటుందేమో! పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. స్నానం చేసే అవకాశం లేదు. నిద్రపోదామన్నా కుదరడం లేదు. ఆఖరికి జబ్బు చేస్తే మందులు వేసుకునే దిక్కూ లేకుండా పోయింది’’అని వాపోతున్నాడు.

అసలేమైంది?
హసన్‌కు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో అర్థం కావాలంటే సిరియా గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆ దేశంలో చదువు అయిపోయిన తరువాత కొంతకాలం నిర్బంధంగా మిలటరీలో పనిచేయాలి. ఒకవేళ చదువు అయిపోయే సమయానికి దేశంలో లేకపోతే.. ఏటా కొంచెం రుసుము చెల్లించి మినహాయింపు పొందవచ్చు. ఈ క్రమంలో హసన్‌ కూడా తన చదువు అయిపోతూండగానే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు వెళ్లిపోయాడు.

మూడు, నాలుగు కంపెనీల్లో బీమా ఏజెంటుగా పనిచేశాడు. అంతా బాగానే ఉందికదా అనుకుంటున్న సమయంలో 2011లో సిరియాలో యుద్ధం మొదలైంది. విదేశాల్లో ఉన్న సిరియన్లు యుద్ధంలో పాల్గొనేందుకు స్వదేశానికి రావాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. కానీ యుద్ధంలో పాల్గొనడం ఇష్టంలేని హసన్‌ సిరియాకు వెళ్లలేదు. దాంతో సిరియా ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టును రద్దు చేసేసింది.

హసన్‌ నిఘా సంస్థల కళ్లలో పడకుండా యూఏఈలోనే కొంతకాలం నెట్టుకురాగలిగినా.. వర్క్‌ పర్మిట్‌ను పునరుద్ధరించుకునే అవకాశం లేక ఉద్యోగంలో కొనసాగలేకపోయాడు. చివరికి యూఏఈ అధికారులు హసన్‌ను అదుపులోకి తీసుకుని 3 నెలల వర్క్‌ పర్మిట్‌ ఇచ్చి మలేసియాకు పంపారు. ఆ సమయం ముగిశాక ఈక్వెడార్‌కు వెళ్లేందుకు టర్కీకి చెందిన విమానం ఎక్కడం.. అది కాస్తా టికెట్‌ రద్దు చేయడంతో మలేసియాలోని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు.

నాసాకు దరఖాస్తు..
హసన్‌ కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఉండిపోయి మూడు నెలలు దాటిపోయింది. ఆయన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. తన దుస్థితిపై అప్పుడప్పుడూ ఫేస్‌బుక్‌ పోస్టులు పెడుతున్నాడు. చివరికి విసుగొచ్చి.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. ‘చిన్నప్పటి నుంచి అంతరిక్ష సంబంధిత సినిమాలు బోలెడన్ని చూశాను.

అంతరిక్ష నౌకల్లో ఎప్పుడు, ఏం చేయాలో బాగా తెలుసు. ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నన్ను అంగారకుడిపైకి పంపే నౌకలో చేర్చుకోండి..’’అంటూ లేఖలూ రాశాడు. నాసా ఏం చేస్తుందో తెలియదుగానీ.. హసన్‌ను ఈ కష్టాల నుంచి బయటపడేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం ప్రయత్నిస్తోంది. ఆయనను శరణార్థిగా కెనడాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
 

హసన్‌ తరహాలోనే.. ‘ద టెర్మినల్‌..’
2004లో హాలీవుడ్‌లో ‘ది టెర్మినల్‌’పేరిట ఓ సినిమా వచ్చింది. ఆస్కార్‌ అవార్డు గ్రహీత టామ్‌ హ్యాంక్స్, కెథరీన్‌ జెటా జోన్స్‌ హీరో, హీరోయిన్లు. విక్టర్‌ నొవరోస్కీగా పేరున్న హీరో మరో దేశ విమానాశ్రయంలో దిగే సమయానికి.. ఆయన స్వదేశంలో మిలటరీ తిరుగుబాటు జరుగుతుంది. ఇతర దేశాలన్నీ ఆ దేశంతో సంబంధాలు తెంచుకుని, ఆ దేశ పౌరులను తమ దేశాల్లోకి అడుగుపెట్టనిచ్చేది లేదని తీర్మానం చేస్తాయి. దీంతో నొవరోస్కీ విమానాశ్రయంలోనే చిక్కుకుపోతాడు.

కొన్ని నెలలపాటు అక్కడే గడుపుతాడు. ఇమిగ్రేషన్‌ అధికారిణిగా పనిచేస్తున్న హీరోయిన్‌తో పరిచయం, ప్రేమ అన్నీ విమానాశ్రయంలోనే జరిగిపోతాయి. చివరకు క్రాకోజియాలో యుద్ధం ముగియడంతో విక్టర్‌ సమస్యలు తీరిపోతాయి. స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ హాలీవుడ్‌ సినిమాకు... హసన్‌ అల్‌ కొంటార్‌ తాజా పరిస్థితికి సారూప్యత బోలెడంత!!


– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు