ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!

23 Aug, 2018 12:32 IST|Sakshi
ప్రపంచాన్ని కన్నీరు పెట్టించిన అలన్‌ కుర్దీ ఫొటో

‘‘అక్కా... నేను, నా కుటుంబం సముద్రాన్ని దాటేశాం. ఇక నిన్ను చూడటమే తరువాయి’ అనే నా తమ్ముడి మాటల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ ఎన్ని రోజులైనా నిరీక్షణకు తెరపడటం లేదు. సరిగ్గా అదే సమయంలో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఆ ఒక్క ఫొటో... నేనింక ఎవరికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. నా ఆశలన్నీ అడియాసలు చేస్తూ నన్ను వెక్కిరించింది. నీలం రంగు ప్యాంటు... ఎర్ర షర్టు... నేను వాడికి బహుమానంగా ఇచ్చిందే కదా ఆ డ్రెస్సు... అంటే ఆ ఫొటో వాడిదే... ముద్దులొలికే నా మేనల్లుడు అలన్‌ కుర్దీదే...’ అంటూ సిరియా ఆడపడుచు టిమ్‌ కుర్దీ ‘ద బాయ్‌ ఆన్‌ ద బీచ్‌’  అనే పుస్తకం పేరిట సిరియాలో జరుగుతున్న నరమేధం గురించి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

సరిగ్గా మూడేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్‌ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. అటువంటి ఫొటోలు, మనసును కదిలించే ఎన్నెన్నో దృశ్యాలు ఆధిపత్య పోరును ఏమాత్రం ఆపలేకపోయాయి. పైపెచ్చు ఇటువంటివి అక్కడ సాధా‘రణమే’లే అని సరిపెట్టుకునే మానసిక స్థితికి మనల్ని తీసుకొచ్చాయి. ఈ భావన పెరిగిపోకూడదనే... ‘ద బాయ్‌ ఆన్‌ ద బీచ్‌’  పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చారు అలన్‌ కుర్దీ మేనత్త టిమ్‌ కుర్దీ.

జీరో టాలరెన్స్‌ పేరిట అమెరికా అనుసరిస్తున్న విధానాలు శరణార్థుల పాలిట శాపంగా మారిన నేటి తరుణంలో.. తలదాచుకునేందుకు కాస్త చోటైనా దొరికితే చాలంటూ వలస వెళ్లే క్రమంలో... శరణార్థులు ఎదుర్కొనే ఇబ్బందులు, వాళ్లు పడుతున్న అగచాట్ల గురించి... టిమ్‌ రాసిన అక్షరాలు ప్రతీ ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తాయి.

తప్పే కానీ తప్పలేదు...
శరణార్థులకు కూడా జీవించే హక్కు ఉంటుందనే విషయాన్ని ప్రపంచం మర్చిపోకూడదనే తాను ఈ పుస్తకాన్ని రాశానన్న టిమ్‌... ‘పెళ్లి చేసుకుని కెనడా వచ్చాను. కానీ నా మనసు మాత్రం సిరియాలోనే ఉండిపోయింది. నా వాళ్లంతా అక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటే అన్నం కూడా సహించేది కాదు. ఈ కారణంగానే నా కెరీర్‌ను కూడా నిర్లక్ష్యం చేశాను. వాళ్ల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అని నిరంతరం ఆలోచించేదాన్ని. ఆ క్రమంలోనే నా తోబుట్టువులను శరణార్థులుగా కెనడాకు తీసుకు రావాలని భావించాను. అది సాధ్యపడుతుందని అనిపించలేదు. అందుకే సముద్ర ప్రయాణం ద్వారా వాళ్లంతా యూరప్‌ చేరుకునేందుకు 5 వేల డాలర్లు స్మగ్లర్లకు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. ఆ సమయంలో అదే సరైన మార్గంగా తోచింది. కానీ దయలేని దేవుడు.. అలన్‌, రేహానా, గలీబ్‌లను తన దగ్గరికి తీసుకువెళ్లాడంటూ’  తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం గురించి చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు అబ్దుల్లా(అలన్‌ కుర్దీ తండ్రి) బతికి ఉన్నా శవాలతో సమానమంటూ కన్నీంటి పర్యంతమయ్యారు.

రెండు భాషల్లో...
తన ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయాలనే సంకల్పంతోనే ‘ద బాయ్‌ ఆన్‌ ద బీచ్‌’ పుస్తకంలోని ప్రతీ చాప్టర్‌ను అరబిక్‌తో పాటు ఇంగ్లీషు భాషలో కూడా అచ్చువేయించారు టిమ్‌ కుర్దీ. అరబిక్‌ భాషలోని సామెతలు, జాతీయాలు ఉపయోగిస్తూ మనసుకు హత్తుకునే విధంగా అక్షరాలను తీర్చిదిద్దారు. అలన్‌ ఙ్ఞాపకంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకమైనా.. కరుడుగట్టిన నేతల పాషాణ హృదయాల్ని కాస్తైనా కరిగించాలని నిండు మనసుతో ఆకాంక్షిద్దాం.

-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా