కంప్యూటరే లాయరు

15 May, 2016 02:03 IST|Sakshi
కంప్యూటరే లాయరు

♦ కొత్త పరిజ్ఞానాన్ని రూపొందించిన ఐబీఎమ్
♦ న్యాయ సమస్యలకు చిటికెలో పరిష్కారాలు  చూపుతున్న రాస్
♦ విడుదలవగానే ఉద్యోగమిచ్చిన న్యూయార్క్ న్యాయ సంస్థ  బేకర్ అండ్ హాస్టెట్లర్
 
 వాషింగ్టన్: ఏళ్ల తరబడి పరిష్కారం లేకుండా ఉన్న కోర్టు కేసులను, చట్టం పుస్తకాలతో కుస్తీలు పట్టే న్యాయవాదులను చూస్తూనే ఉంటాం. ఇకపై ఇలాంటి సమస్యలకు ఊరట కలిగించేలా కంప్యూటర్ లాయర్లు అందుబాటులోకి రానున్నాయి. కేసు గురించి చెప్పగానే.. దీన్ని వాదించేందుకు కావాల్సిన సలహాలు, సూచనలను నిమిషాల్లో ఇవి అందించనున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ ఐబీఎమ్ ‘రాస్’ అనే ప్రపంచంలోనే తొలి ‘కృత్రిమ మేధో న్యాయవాది’ని రూపొందించింది. వాట్సన్ కాగ్నిటివ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో ‘రాస్’ను రూపొందించారు. దీని కౌశలాన్ని చూసి మహామహులైన న్యాయ కోవిదులు ఆశ్చర్యపోతున్నారు.
 
 రాస్ ఏమేం చేస్తుంది?
 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కంప్యూటర్ టెక్నాలజీయే ‘రాస్’. ఏదైనా కేసును దీనికి అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్పినా అర్థం చేసుకుంటుంది. దీన్ని తనకున్న పూర్తి సమాచారంతో కేసును విశ్లేషించుకుని.. పూర్తి వివరణాత్మకంగా పరిష్కారం సూచిస్తుంది. దీంతోపాటు గతంలో జరిగిన ఇలాంటి కేసులేంటి? ఎక్కడెక్కడ, ఏవిధంగా దీనిపై వాదనలు జరిగాయి? ఎలాంటి ఆధారాలను పొందుపరిచారు? ఏ విధమైన తీర్పులు వెలువరించారో మనకు అర్థమయ్యేలా చెబుతుంది. ఈ రాస్‌తో మాట్లాడుతున్నంత సేపు సదరు కేసు గురించి మన న్యాయవాద మిత్రుడితో మాట్లాడినట్లుగానే ఉంటుందని దీన్ని రూపొందించిన ఐబీఎమ్ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు చట్టాల్లో వస్తున్న మార్పులు, తాజా కోర్టు తీర్పులను తెలిపి.. దీనికి అనుగుణంగా న్యాయవాదులు వ్యవహరించాల్సిన తీరుపైనా స్పష్టతనిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది దివాళా కేసులకు మాత్రమే సలహాలిస్తుంది.
 
 ఆశ్చర్యపోతున్న న్యాయకోవిదులు
 అసలు ‘రాస్’ గురించి ఐబీఎమ్ చెప్పటం సరే ఇదేలా పనిచేస్తుందని పలువురు న్యాయకోవిదులు పరీక్షించారు. వివిధ కేసులను రాస్‌తో ప్రస్తావించి.. పరిష్కారం కోరారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీరి దగ్గరున్న సమాచారంతోపాటు అదనపు సమాచారాన్ని, మారిన చట్టంలో సవరణలను చెప్పి వారందరినీ రాస్ ఆశ్చర్యపరిచింది.
 
 రాస్‌కు ఉద్యోగం
 2011లోనే రాస్‌ను రూపొందించినా.. తర్వాత పది నెలలపాటు దీనికి దివాళా చట్టం (బ్యాంక్ప్ట్స్రీ లా)ను నేర్పించారు. 2014లో పరీక్షించినపుడు దీని కౌశలాన్ని గమనించిన న్యూయార్క్ లా ఫర్మ్ ‘బేకర్ అండ్ హాస్టెట్లర్’ రాస్‌కు ఉద్యోగమిచ్చింది. ‘రాస్ వంటి తెలివైన కృత్రిమ న్యాయవాది సంస్థలో చేరటం మాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో మా క్లయింట్లకు మరింత విస్తృతమైన సేవలను అందిస్తాం’ అని సంస్థ తెలిపింది.
 
 మరింత పరిశోధన: ఐబీఎం
 రాస్‌కు ప్రస్తుతానికి దివాళా చట్టంపై పూర్తి అవగాహన ఉంది. దీని ఆధారంగా భవిష్యత్తులో ఇతర విభాగాల్లోనూ దీనికి శిక్షణ ఇచ్చేందుకు పరిశోధనలు చేస్తున్నామని ఐబీఎమ్ వెల్లడించింది. వినియోగిస్తున్న కొద్దీ దీని కౌశలం పెరుగుతుందని, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది.

మరిన్ని వార్తలు