పండా పుట్టినరోజు.. ఆ జూకు పండగరోజు.

7 Jul, 2014 04:57 IST|Sakshi
పండా పుట్టినరోజు.. ఆ జూకు పండగరోజు.

తైపీ: యువాన్ జాయ్ అనే ఈ పండా కూనకు ఆదివారం మొదటి పుట్టినరోజు. దీని బర్త్‌డే వేడుకలను తైవాన్‌లోని తైపీ జూ నిర్వాహకులు, సందర్శకులు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఆపిల్స్, పైన్‌ఆపిల్స్, క్యారెట్లు, బన్స్‌తో ప్రత్యేక కేక్‌ను తయారు చేసి దీనికి అందించారు. పిల్లలు, పెద్దలు కలసి 3 వేల మంది 10 కి.మీ. పరుగు పందెంలో పాల్గొన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దీని పుట్టినరోజు ఇంత ఘనంగా ఎందుకంటే తైవాన్‌లో పుట్టిన మొట్టమొదటి పండా ఇదే మరి! తైవాన్‌కు 2008లో చైనా ఇచ్చిన ఓ పండా జంటకు గతేడాది ఇది జన్మించింది. అయితే సహజ ప్రక్రియలో ఈ పండా తల్లి గర్భం దాల్చలేకపోయింది.
 
దీంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఈ పండాకు జన్మనిచ్చేలా చేశారు. పైగా ఇది పుట్టిన తర్వాత జూకు సందర్శకుల తాకిడి కూడా  విపరీతంగా పెరిగిపోయిందట. అందుకే ఈ బుల్లి పండాకు యమా క్రేజ్ వచ్చేసింది. అన్నట్టూ.. చిన్నప్పుడు రకరకాల వస్తువులు పిల్లల ముందేసి వారు ఏది పట్టుకుంటే పెద్దయ్యాక అదే అవుతార ని చెబుతూ మురిసిపోయే ఆట మాదిరిగా ఈ పండాను కూడా పరీక్షించారు. రకరకాల పెయింటింగ్‌లను దీని ముందు వేలాడదీయగా.. ఇది పెయింటర్ పండా ఉన్న బొమ్మను పట్టుకుందట. అంటే భవిష్యత్తులో మంచి పెయింటర్ అవుతుందన్నమాట!

>
మరిన్ని వార్తలు